- గ్రౌండ్ వాటర్ లెవెల్స్పడిపోవడమే కారణం
- 80 శాతం బుకింగ్స్ వెస్ట్ సిటీ నుంచే ..
- కోర్ సిటీలోనూ సమస్య..
హైదరాబాద్ సిటీ, వెలుగు : వేసవి రాకముందే నగరంలో నీటి కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వానలు లేక భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల టైంలో సాధారణం కంటే లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సిటీలో వేగంగా భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇది జలమండలి వాటర్ట్యాంకర్ల బుకింగ్‌ను అమాంతం పెంచేసింది. గతేడాది ఈ టైంలో సిటీలో రోజుకు 3 వేల ట్యాంకర్లకు డిమాండ్ ఉండగా..ప్రస్తుతం అది ఏకంగా 6 వేలకు చేరింది. ఈ నెల 5న ఏకంగా 6700 ట్యాంకర్ల బుకింగ్స్రావడం సిటీలో నీటి డిమాండ్‌కు ఉదాహరణగా నిలుస్తున్నది.
ఎక్కడెక్కడ డిమాండ్ఉందంటే..
భూగర్భ జలాలు పడిపోవడంతో నగరంలోని దాదాపు 80 శాతం వాటర్ ట్యాంకర్ల డిమాండ్ ప్రధానంగా ఐటీ కారిడార్ (వెస్ట్ జోన్) లోనే ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ లలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, మల్టీస్టోర్డ్బిల్డింగులు ఎక్కువగా ఉండడం, ఇక్కడ భూగర్భ జలాలు 100 మీటర్ల లోతుకు పడిపోవడంతో బోర్‌వెల్స్ పూర్తిగా ఎండిపోయి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఇక శేరిలింగంపల్లి, హఫీజ్‌పేట్, మణికొండల్లో కొత్త ఇండ్ల నిర్మాణాలు వేగవంతం కావడం, గేటెడ్ కమ్యూనిటీలు విపరీతంగా పెరగడంతో రోజువారీ ట్యాంకర్ల బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాయదుర్గం, అయ్యప్ప సొసైటీ, టీఎన్‌జీఓస్ కాలనీల్లో కమర్షియల్ తో పాటు డొమెస్టిక్ వాటర్ట్యాంకర్ల కొరత వేధిస్తున్నది. వీటితో పాటు నార్త్ వెస్ట్‌జోన్‌లోని కూకట్‌పల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్, మియాపూర్ ప్రాంతాల్లో అత్యధిక జన సాంద్రత ఉంటుంది. ఇక్కడ జలమండలి పైప్‌లైన్ వ్యవస్థ ఉన్నా కూడా వేల సంఖ్యలో ట్యాంకర్ల అవసరం ఏర్పడుతున్నది.
ఎక్కడెక్కడ ఎంత తగ్గాయంటే
గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే హైదరాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు సగటున 6.46 మీటర్ల మేర లోతుకు పడిపోయాయి. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా సగటు నీటిమట్టాలు 3.55 మీటర్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 10.01 మీటర్లకు పడిపోయాయి. నేచర్‌క్యూర్ హాస్పిటల్ వద్ద గతేడాది 1.16 మీటర్లుగా ఉన్న గ్రౌండ్ వాటర్ ఈ ఏడాది సెప్టెంబర్ లో 34.99 మీటర్లకు, మారెడ్ పల్లిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ వద్ద గతేడాది 3.10 మీటర్లుండగా ఈ ఏడాది 17.83 మీటర్లకు, ఖైరతాబాద్ లో గతేడాది 2.04 మీటర్లు ఉండగా, ఈ సారి 11.27 మీటర్లకు పడిపోయింది.
రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లా సగటున గతేడాది సెప్టెంబర్‌లో 6.31 మీటర్ల లోతులో ఉండగా..ఈ ఏడాది సెప్టెంబర్‌లో 11.74 మీటర్లకు పడిపోయింది. హయత్‌నగర్‌లో గతేడాది 6.96 మీటర్లుంటే ఈసారి 19.98 మీటర్లకు పడిపోయింది. ఇబ్రహీంపట్నంలో గతేడాది 14.25 మీటర్లుంటే ఈ సారి 24.37 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాదితో పోలిస్తే చేవెళ్లలో 8.72 మీటర్లు, అబ్దుల్లాపూర్ మెట్ లో 6.89 మీటర్ల మేరా నీటిమట్టాలు పడిపోయాయి. మేడ్చల్–-మల్కాజిగిరి జిల్లాలో సగటున 6.30మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యధికంగా మేడిపల్లి లో 13.02 మీటర్ల మేర గ్రౌండ్ వాటర్ పడిపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ 9.77 మీటర్లుగా ఉన్న నీటి మట్టం..ఈ ఏడాది సెప్టెంబర్‌లో 22.79 మీటర్లకు చేరింది. దుండిగల్-గండిమైసమ్మ మండలంలో గతేడాది 9.85 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు, ఈ ఏడాది 20.08 మీటర్లకు, ఉప్పల్ మండలంలోనూ గతేడాది 6.13 మీటర్లు..ఈ ఏడాది 14.85 మీటర్లకు పడిపోయింది. మేడ్చల్ మండలంలోనూ లాస్ట్ ఇయర్ 3.05 మీటర్ల పైకి ఉన్న వాటర్ ఈ ఏడాది 11.17 మీటర్ల లోతుకు పడిపోయింది.
సెంట్రల్ హైదరాబాద్ లోనూ..
సెంట్రల్ హైదరాబాద్ అయిన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లలో విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సులు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్‌ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. కొద్ది రోజుల కింద కేబీఆర్ చుట్టుపక్కల వన్-వే పెట్టడంతో ట్యాంకర్లు రావడం ఆలస్యమవుతున్నది. అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డిగూడలో హాస్టళ్లు, షాపులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కూడా ట్యాంకర్ల కోసం జనాలు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇక ముషీరాబాద్, చిలకలగూడల్లోని బస్తీలు, కాలనీల్లోనూ సాధారణ రోజుల కంటే రెట్టింపు సంఖ్యలో ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. జలమండలి ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా దాదాపు 1,250 కి పైగా ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ 12 వేల నుంచి 15 వేల వరకు ట్రిప్పులు నడుపుతున్నప్పటికీ చాలా ఏరియాల్లో డిమాండ్ కు తగ్గట్టు సరఫరా
చేయలేకపోతున్నారు.
వాటర్ బోర్డు ఏం చేస్తోంది?
ట్యాంకర్లకు డిమాండ్ఏర్పడడంతో వాటర్ బోర్డు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ట్యాంకర్ల వెయిటింగ్టైం తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు, బంజారాహిల్స్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వన్-వే ట్రాఫిక్ కారణంగా ట్యాంకర్ల రాకపోకలు ఆలస్యమవుతుండటంతో అక్కడ అదనపు వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. సెప్టెంబర్ లో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల అసోసియేషన్లు సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా జలమండలి వారితో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేసింది. దీనివల్ల ఐటీ కారిడార్లు, నివాస ప్రాంతాల్లో ట్యాంకర్ల సేవలకు అంతరాయం కలగకుండా చూశారు. వస్తున్న బుకింగ్స్‌ను రీచ్కావడానికి దాదాపు 1,100కి పైగా ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ వేల సంఖ్యలో ట్రిప్పులను నడుపుతున్నారు. డొమెస్టిక్ (గృహ అవసరాల) కోటా కింద బుక్ చేసుకునే ట్యాంకర్లను బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ అవసరాలకు మళ్లించకుండా ట్యాంకర్లకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. రూల్స్బ్రేక్చేస్తే ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
