సిరిసిల్ల, సిద్దిపేటలో భూములు కాజేశారు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

సిరిసిల్ల, సిద్దిపేటలో భూములు కాజేశారు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌తో అక్రమాలు గుర్తించాం: పొంగులేటి
  •     త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ 
  •     ఇప్పటికే 48 మందిపై క్రిమినల్ కేసులు 
  •     చలాన్ల సొమ్ము దోపిడీపైనాఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌కు ఆదేశం 
  •     ప్రభుత్వ భూములు, చలాన్ల సొమ్ము కొట్టేసినోళ్లను వదిలిపెట్టమని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌లోని సాంకేతిక లొసుగులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టినోళ్లను, రిజిస్ట్రేషన్ల చలానా సొమ్మును కాజేసినోళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వంలోని పెద్దలు ధరణిని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కాజేశారని, వారి బాగోతాలన్నింటినీ బయటపెడతామని తెలిపారు. 

శనివారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ధరణి అక్రమాలపై నియమించిన ఉన్నతస్థాయి కమిటీతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరణి అక్రమాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌లో అనేక అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక నివేదికలో తేలిందని తెలిపారు. 

ఈ నివేదికను పరిశీలించిన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లోనూ ఇదే తరహాలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భూరికార్డుల ప్రక్షాళన పేరుతో తెచ్చిన ధరణి పోర్టల్ ద్వారా జరిగిన దోపిడీని వెలికితీస్తామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి జరిగిన 35 లక్షల లావాదేవీలను పరిశీలించగా, ప్రాథమికంగా 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు జరిగినట్లు గుర్తించామని అధికారులు మంత్రికి వివరించారు. విచారణలో 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు రూ.4 కోట్లు ప్రభుత్వానికి చెల్లించకుండా దారి మళ్లించినట్లు తేలిందన్నారు. 

దీనిపై స్పందించిన మంత్రి.. భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ నిర్వహించి అక్రమాలను గుర్తించామని, తక్షణమే 9 జిల్లాల్లోని 35 మండలాల్లో అక్రమాలకు పాల్పడిన 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. విచారణలో వెలుగుచూసిన అంశాలు, తెరవెనుక సూత్రధారులు, రెవెన్యూ అధికారుల పాత్రపై లోతైన విచారణ జరిపి తుది నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధరణి బ్యాక్‌‌‌‌‌‌‌‌ఎండ్‌‌‌‌‌‌‌‌లో చలాన్ల సొమ్ము కొట్టేశారనే దానిపైనా ఫోరెన్సిక్​ఆడిట్‌‌‌‌‌‌‌‌కు ఆదేశించారు. ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయని, అందులో భాగంగానే ఫోరెన్సిక్​ఆడిట్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. 

కేటీఆర్​ స్థాయికి నేను చాలు.. 

ధరణి అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఒకరు వెయ్యి కోట్లని, మరొకరు పదివేల కోట్లని, ఇంకొకరు భూభారతి పోర్టల్ అవినీతిమయమని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని పొంగులేటి మండిపడ్డారు. సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడయాతో చిట్‌‌‌‌‌‌‌‌చాట్​చేశారు. గత ప్రభుత్వం అనాలోచితంగా, కుట్రపూరితంగా ధరణిని తీసుకురావడం వల్లే ఈ అనర్థాలు జరిగాయని మండిపడ్డారు. 

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న భాష సరిగా లేదని, ఆయన మతిలేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు సీఎం అవసరం లేదని, ఆయన స్థాయికి తాను చాలునని, తనను ఎదుర్కొన్నాకే సీఎం దగ్గరకు వెళ్లాలని సవాల్ విసిరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను తాను వ్యక్తిగతంగా రెఫరెండంగా భావిస్తున్నానని, ఆ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని చాలెంజ్ చేశారు. అక్రమాలపై వేసిన సిట్ విచారణ చట్టప్రకారం జరుగుతుందని, త్వరలోనే నిజమైన సీరియల్ చూస్తారని, అందులో సీరియస్ ఎపిసోడ్లు ఉంటాయని మంత్రి వ్యాఖ్యానించారు. 

చట్ట పరిధిలో ఉంటే కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు కూడా నోటీసులు ఇస్తారని స్పష్టం చేశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల రద్దు సాధారణ ప్రక్రియ అని, కిషన్ రెడ్డి అక్కడికి వెళ్లి ఏం తప్పు జరిగిందో తేల్చాలని అన్నారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి బంధుత్వం లేదని, ఆయన కేసీఆర్ హయాం నుంచే వ్యాపారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. దావోస్ పర్యటనకు తన కుమారుడు సొంత ఖర్చులతో బిజినెస్ మ్యాన్‌‌‌‌‌‌‌‌గా వెళ్లారని, చిరంజీవి కూడా స్వతహాగా వెళ్లారని, ప్రభుత్వ సొమ్ముతో కాదని స్పష్టం చేశారు. 

అగ్నిప్రమాదంపై ఆరా.. 

నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదంపై పొంగులేటి తక్షణమే స్పందించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, అదనపు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తేవాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి పూర్తి నివేదిక ఇవ్వాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.