317పై అప్పీల్స్ అన్నీ పక్కకే!

317పై అప్పీల్స్ అన్నీ పక్కకే!

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో సర్కారీ కేడర్ అలాట్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317పై ఇంకా టీచర్లలో అసంతృప్తి తగ్గడం లేదు. లోకాలిటీ నుంచి సీనియార్టీ వరకూ అన్యాయం జరిగిందని అప్పీల్స్ పెట్టుకున్నా, వాటిని సర్కారు పరిష్కరించడం లేదు. నెలల తరబడి పెండింగ్ పెట్టి, వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కనీసం ఆ అప్పీల్స్​ను పరిష్కరిస్తారా? లేదా? అనే విషయంపై సర్కారు గానీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గానీ క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో టీచర్ల సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

లొకాలిటీ అప్పీల్స్ పెండింగ్.. 
కొత్త జోన్లకు అనుగుణంగా టీచర్లు, ఎంప్లాయీస్​ను అలాట్ చేసేందుకు నిరుడు డిసెంబర్ 6న ప్రభుత్వం జీవో నెంబర్ 317 తీసుకొచ్చింది. జీవోకు అనుగుణంగా టీచర్లను అలాట్ చేయడంలో అనేక పొరపాట్లు జరిగాయి. చాలా జిల్లాల్లో సీనియార్టీ లిస్టులు తప్పులతడకగా ప్రకటించారు. వేలమంది తమ స్థానికతను కోల్పోయారు. దీనిపై టీచర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అయితే ముందుగా కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని, ఆ తర్వాతే అప్పీల్స్​ పెట్టుకోవాలని సర్కారు ఉత్తర్వులిచ్చింది. దీంతో జీవో 317తో ఇబ్బందులు పడ్డ సుమారు 8 వేల మంది జిల్లాల్లో అప్పీల్స్ పెట్టుకున్నారు. వీటిలో సగానికి పైగా లోకాలిటీ మారిందని పెట్టుకున్నవే ఉన్నాయి. అయితే ఇవన్నీ పక్కనపెట్టినట్టు అధికారులు చెప్తున్నారు. 

స్పౌజ్ అప్పీల్స్ పరిష్కరించాలె.. 
మరోపక్క స్పౌజ్ అప్పీల్స్​లో కొన్నింటినీ పరిష్కరించి, మరికొన్నింటిని పెండింగ్ లో పెట్టారు. కేవలం 19 గ్రామీణ జిల్లాల్లో స్పౌజ్​ ట్రాన్స్​ఫర్లకు ఓకే చెప్పిన సర్కార్, మిగిలిన 13 పట్టణ జిల్లాలను మాత్రం బ్లాక్​లో పెట్టింది. దీంతో వీరి అప్పీల్స్​ అన్నీ పెండింగ్​లోనే ఉన్నాయి. 19 గ్రామీణ జిల్లాలకు జూనియర్ ఉద్యోగులు, అదనంగా స్పౌజ్ ఉద్యోగులు కూడా వెళ్లారు. పట్టణ జిల్లాలకు అంతే సంఖ్యలో సీనియర్లు వెళ్లారు. అయితే,  సమీప భవిష్యత్తులో పట్టణ జిల్లాల్లోనే రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ 13 పట్టణ జిల్లాల నుంచి ఎంత మంది గ్రామీణ జిల్లాలకు వెళ్లారో.. అంతమందికి పట్టణ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని, ప్రమోషన్ల సందర్భంగా మిగతా స్పౌజ్ లను ఒకేచోటకు చేర్చి సీఎం మాటను నిలబెట్టుకోవాలని టీచర్లు కోరుతున్నారు. అయితే రివర్స్​ స్పౌజ్​కు చాన్స్ ఇచ్చినా పెద్దగా టీచర్లు ముందుకు రాలేదు. మరోపక్క కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించి, వారు కొరుకున్న జిల్లాకు పోస్టింగ్​ ఇప్పించుకున్నారు. కొన్ని మెడికల్ గ్రౌండ్స్, విడో, సింగిల్ ఉమెన్ అప్పీల్స్, స్పౌజ్​ కేటగిరీలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్పీల్స్ కూడా పెండింగ్​లో ఉన్నాయి. అయితే మార్చి 1 నుంచి మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్ల అప్లికేషన్లు తీసుకుంటామని సర్కారు ప్రకటించినా, సీనియార్టీని కోల్పోవాలనే నిబంధనతో టీచర్లంతా పోవాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నారు. 

‘సీనియార్టీ’ ఇష్యూ త్వరలో పరిష్కారం? 
టీచర్ల సీనియార్టీ లిస్టులను అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా తయారు చేశారు. దీంతో జూనియర్ల పేర్లు ముందుకు, సీనియర్ల పేర్లు చివర్లో వచ్చాయి. దీనిపై సుమారు 200 మంది అప్పీల్​ చేసుకున్నారు. వీటిని ఎలా సరిచేయాలనే దానిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కుస్తీ పడుతున్నారు. వారం రోజులుగా జీఏడీ చుట్టూ తిరుగుతున్నారు. అయినా పరిష్కారం మాత్రం చూపించలేకపోయారు. సీనియార్టీ లిస్టు తప్పులతో  మహబూబ్​నగర్ జిల్లాలో హిందీ పండిట్లకు ఇప్పటికీ స్కూల్ పోస్టింగ్​లు ఇవ్వలేదు. ఆ జిల్లాకు అలాటైన టీచర్లు డీఈఓ ఆఫీసుకు వచ్చి సంతకం చేసి పోతున్నారు. రెండు రోజుల కింద గెజిటెడ్ హెడ్మాస్టర్లకు పోస్టింగ్​లు ఇచ్చారు. త్వరలోనే సీనియార్టీ అప్పీల్స్​కు పరిష్కారం లభిస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కానీ అప్పీల్స్ పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.