ఒడిశా ప్రభుత్వం అన్‌లాక్‌- 5 మార్గదర్శకాలు

ఒడిశా ప్రభుత్వం అన్‌లాక్‌- 5 మార్గదర్శకాలు

ఒడిశా ప్రభుత్వం అన్‌లాక్ -5 మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 31 వరకు ప్రార్థనా స్థలాలు, సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌ టైన్మెంట్ కాంప్లెక్స్‌లు, థియేటర్లు, ఆడిటోరియంలు, స‌మావేశ‌ హాళ్ళు మూసి ఉంటాయ‌ని తెలిపింది. వీటితో పాటు స్కూళ్లు, కాలేజీలు, యూనివ‌ర్సిటీలు, ఇతర విద్యా, శిక్షణా సంస్థలు, అంగన్‌వాడీలు కూడా అక్టోబర్ 31 వరకు మూసివేసే ఉంటాయంది. స్పెష‌ల్ రిలీఫ్ క‌మిష‌న‌ర్ కార్యాలయం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్లు, జిల్లా స్థాయిలో ఎటువంటి లాక్‌డౌన్ విధించేందుకు వీలులేదని తెలిపింది.

నవంబర్ 3న బాలాసోర్, టిర్టోల్ అసెంబ్లీ విభాగాలకు ఉప ఎన్నికలు జ‌ర‌గాల్సి ఉంది. ఈ క్రమంలో  ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజకీయ సమావేశాలు, ఇతర కార్యక్రమాలు, సమావేశాలను అనుమ‌తిస్తూ ఈసీఐ, ఒడిశా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించ‌డం, థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజింగ్ తప్పనిసరని చెప్పింది. 100 మంది వ్యక్తుల పరిమితికి లోబడి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రాజకీయ సమావేశాలు అనుమతించబడతాయని చెప్పింది ఒడిశా సర్కారు.