ఆఫీసులు.. అధ్వానం!.. శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు 

ఆఫీసులు.. అధ్వానం!.. శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు 
  •  వర్షాలకు ఉరస్తున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు 
  •  మెదక్​ జిల్లాలో ఉద్యోగులు, ప్రజలకు తప్పని తిప్పలు 

మెదక్/కౌడిపల్లి/నిజాంపేట/కొల్చారం, వెలుగు : మెదక్​ జిల్లా ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి అధ్వానంగా ఉంది. పలు మండలాల్లో  ప్రజలతో సంబంధాలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ ఆఫీస్ బిల్డింగులు శిథిలావస్థకు చేరాయి. దశాబ్దాల కిందట నిర్మించిన భవనాలు కావడంతో వర్షాలకు ఉరుస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అలాంటి కార్యాలయాల్లో  ఉద్యోగులు, ప్రజలు భయం భయంగా పనులు చేస్తున్నారు. ఏండ్ల నుంచి ఇబ్బంది పడుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 

ఎక్కడెక్కడ.. ఎలా? 

కౌడిపల్లి మండల ప్రజా పరిషత్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దశాబ్దాల కిందట నిర్మించింది కావడం, సరైన మేయింటనెన్స్ లేక పోవడంతో గోడలు అన్నీ బీటలు వారాయి. స్లాబ్ దెబ్బతింది. వర్షం పడితే అన్ని రూమ్ లలో పైనుంచి నీరు ఉరుస్తోంది. దీంతో ఫైల్స్ అన్నీ తడిసి పోతున్నాయి. అధికారులు, స్టాఫ్ ఎవరి రూమ్ లలో వారు విధులు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అందరూ కొద్దిగా బాగున్న ఒక రూంలో  టేబుల్స్ వేసుకుని ఇబ్బందులు పడుతున్నారు.

బిల్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. నిజాంపేట మండలం ఏర్పడి ఏడేండ్లు గడిచినా మండల ఆఫీసులకు పక్కా బిల్డింగులను గవర్నమెంట్ నిర్మించలేదు. తహసీల్దార్ ఆఫీస్ ను ఓ పెంకుటింట్లో ఏర్పాటు చేశారు. వర్షాలు కురిసినప్పుడల్లా ఆ ఇల్లు ఉరుస్తుండటంతో ఆఫీస్ లోని ఫైళ్లు తడిసి పోతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే ఎప్పుడూ కూలిపోతుందోనని భయంతో డ్యూటీ చేస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. రామాయంపేట తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 

 కొల్చారం మండల ప్రజా పరిషత్ ఆఫీస్ బిల్డింగ్ దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మించింది కావడంతో శిథిలావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మండల ప్రజా పరిషత్ ఆఫీసుకు కొత్త బిల్డింగ్ మంజూరు అయ్యింది. అయితే అప్పట్లో నిధులు సరిపోక నిర్మాణం అసంపూర్తిగా నిలిచి పోయింది. కొల్చారంలో కోటి రూపాయల సీఎం స్పెషల్ ఫండ్స్ నుంచి అసంపూర్తిగా ఉన్న ఎంపీడీవో ఆఫీసుకు నిధులు కేటాయించి పనులు చేపట్టినప్పటికీ వినియోగంలోకి తీసుకు రావడం లేదు. ఇలా ఏండ్ల కొద్దీ శిథిలావస్థలో ఉన్న బిల్డింగుల్లో ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి పక్కా భవనాలు నిర్మించాలని కోరుతున్నారు.