
- ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించేందుకు టన్నుకు రూ.342 వసూలు
- కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్లకు, పాత వాటిని కూల్చినోళ్లకు
- సమస్యగా మారిన అధిక చార్జీలు
- గ్రేటర్లో మరో రెండు సీ అండ్ డీ ప్లాంట్ల ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లింగ్ కోసం సీ అండ్ డీ( కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ ) ప్లాంట్లు నగరంలో రెండు ఉన్నప్పటికీ వేస్టేజ్ తరలింపు కొత్తగా బిల్డింగ్ కట్టేటోళ్లకు సమస్యగా మారింది. చెత్తను తరలించడానికి చార్జీలు ఎక్కువ ఉండటంతో వేస్టేజ్ ను ఎక్కడ వేయాలనే దానిపై టెన్షన్ మొదలైంది. బిల్డింగ్ వేస్టేజ్ ను రీసైక్లింగ్ చేయడానికి గతంలో బల్దియా రెండు సీ అండ్ డీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. నిర్మాణ వ్యర్థాలను సేకరించి ఇక్కడ రీసైక్లింగ్ చేస్తోంది. కానీ చెత్తను సేకరించేందుకు అధికారులు టన్నుకు రూ.342 చార్జి వసూలు చేస్తున్నారు. దీంతో కొందరు టన్నుకి రూ. వంద ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు రాత్రి టైంలో రోడ్ల పక్కన, చెరువులో బిల్డింగ్ వేస్టేజ్ ను పారేస్తున్నారు.
బయట డంపింగ్ తగ్గించేందుకు
సిటీలో పాత భవనాల కూల్చివేతలు జరిగినప్పుడు ఆ చెత్తను ఇంతకు ముందు చెరువుల్లో, బహిరంగ ప్రదేశాల్లో పారేసేవారు. దాన్ని నివారించేందుకు జీహెచ్ఎంసీ.. రాంకీ సంస్థతో కలిసి సీ అండ్ డీ రీసైక్లింగ్ ప్లాంట్లను జీడిమెట్ల, నాగోల్‌లోని ఫతుల్లా గూడలో ఏర్పాటు చేసింది. 500 టన్నుల కెపాసిటీ గల ఈ ప్లాంట్లలో డైలీ రీ సైక్లింగ్ జరుగుతోంది. కొత్తగా పటాన్ చెరు, కొత్వాల్ గూడల్లో మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. వ్యర్థాలను తీసుకెళ్లేందుకు టోల్ ఫ్రీ నెంబర్1800 1200 72659 కి కాల్ చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ దీంట్లో చెత్తను సేకరించినందుకు ఇంటి ఓనర్ల నుంచి బల్దియా వసూలు చేసే చార్జీలను తగ్గించాలని సిటిజన్లు కోరుతున్నారు.
90 శాతం రీ యూజ్
ప్లాంట్లలో రీసైక్లింగ్పని రాంకీ సంస్థ చేస్తోంది. సేకరించిన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే 80– 20 సైజు కంకర 30 శాతం, ముడి ఇసుక 20 శాతం, ముతక ఇసుక 20 శాతం, దొడ్డు కంకర 25 శాతం ఉత్పత్తి అవుతాయి. మెటీరియల్స్ తో పార్కింగ్ , ఫుట్ పాత్ టైల్స్ ను తయారు చేస్తున్నారు. వీటిని తయారు చేస్తున్న రాంకీ సంస్థ మార్కెట్ రేటుకు అమ్మతూ సుమారు నెలకు రూ.7 నుంచి 8 కోట్ల ఆదాయాన్ని పొందుతోంది.
రేటు తగ్గిస్తే బాగుంటుంది
ఇల్లు కట్టే టైమ్ లో నిర్మాణ వ్యర్థాలు తరలించడం సమస్యగా మారింది. అలా అని ఆ చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేయలేం. జీహెచ్ఎంసీ ప్లాంట్లు ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా వేస్టేజ్ తరలించేందుకు చార్జి ఎక్కువగా ఉంది. టన్నుకి రూ.342 కాకుండా.. తగ్గించి తీసుకోవాలి. చిన్న ఇల్లు కూల్చినా, ఆ చెత్తను తరలించడానికి సుమారు 30వేల పైనే అవుతోంది.
– అనిల్, జగద్గిరిగుట్ట