కొత్త సెక్రటేరియట్ జనవరిలో ఓపెనింగ్ ?

కొత్త సెక్రటేరియట్ జనవరిలో ఓపెనింగ్ ?
  • ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ తో పాటు అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఒకేసారి ప్రారంభించేలా రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నది. జనవరిలోనే ఒపెన్ చేసేలా పనులు స్పీడప్​ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి వస్తున్న లీకుల్లో సెక్రటేరియెట్​ను జనవరి 18న ప్రారంభిస్తారని తెలుస్తున్నది. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి.

మిగిలిన 30శాతం పనులు 2నెలల్లోపు పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకున్నారు. బయట నిర్మిస్తున్న టెంపుల్స్​తో సహా అంతా కంప్లీట్ చేసుకున్నాకే ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందని సీఎం అటు ఉన్నతాధికారులకు, ఇటు ఇంజనీర్లకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇక 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం మాత్రం ఏప్రిల్లో ప్రారంభించనున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన పనులు 44 శాతమే పూర్తయ్యాయి. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియెట్, అమరవీరుల స్మారక చిహ్నం, అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు అన్నీ ఆలస్యం కావడంతో వీటి అంచనా వ్యయం కూడా ముందు అనుకున్న దానికంటే ఎక్కువే అవుతున్నాయి.  

మంత్రుల పరిశీలన

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల  విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ప్రదర్శించిన వీడియో చూసి కొన్ని మార్పులు చెప్పారు. ఫిబ్రవరి లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.