హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ రిపేర్లపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్నది. దాంతోపాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కూడా వీలైనంత త్వరగా నిర్మించాలని అడుగులు వేస్తున్నది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు, అటు తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికే నీళ్లు తీసుకెళ్లాలి కాబట్టి.. ఆ రెండింటి కాంబినేషన్లో గోదావరి, ప్రాణహిత జలాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
అందులో భాగంగానే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కోసం.. డిజైన్లను తయారు చేసేందుకు ఆఫ్రీ కన్సల్టెన్సీ సంస్థకే పనులు అప్పగిస్తూ ఖరారు చేశారు. ఇప్పటికే పోలవరం డయాఫ్రమ్వాల్డిజైన్లు చేయడం, ఐఐటీ బాంబేతో జట్టుకట్టడం, అండర్‌వాటర్ స్టడీలు చేయడంలో సామర్థ్యం ఉండడంతో ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించారు.
సీఎంతో జరిగిన మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వారం, రెండు వారాల్లో బ్యారేజీల వద్ద ఆ సంస్థ పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పుణెకి చెందిన సెంట్రల్వాటర్అండ్ పవర్రీసెర్చ్ స్టేషన్ నిపుణులు జియోటెక్నికల్, జియోఫిజికల్టెస్టులను చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆ టెస్టులు పూర్తయి.. వచ్చిన ఫలితాలకు తగ్గట్టుగా రీహాబిలిటేషన్ డిజైన్లను తయారు చేయనున్నారు.
మూడో టీఎంసీ పనులపైనా దృష్టి
ఆ రెండు అంశాలతో పాటు పక్కకు పడిపోయిన కాళేశ్వరం మూడో టీఎంసీ పనులనూ పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. అదనపు టీఎంసీ ఎత్తిపోతల కోసం రూ.27 వేల కోట్లు ఖర్చవుతుందని డీపీఆర్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే అంత ఖర్చు ఎలా అవుతుంది? ఎన్ని ఎకరాలకు నీళ్లందుతాయి? దానికి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఏంటి? అని ప్రశ్నిస్తూ రాష్ట్ర సర్కారుకు సెంట్రల్ వాటర్ కమిషన్ గతంలోనే లేఖలు రాసింది.
ఆనాటి సర్కారు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో 2024 డిసెంబర్లో మూడో టీఎంసీని అప్రైజల్ లిస్టు నుంచి సీడబ్ల్యూసీ తొలగించింది. వాస్తవానికి ఇప్పుడే కాదు.. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పటి నుంచే మూడో టీఎంసీ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మూడో టీఎంసీలో భాగంగా శ్రీరాంసాగర్కూ నీటిని తరలించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది.
అందుకు మల్లన్నసాగర్వరకు కాలువలు, అక్కడి నుంచి శ్రీరాంసాగర్ వరకు కెనాల్స్‌ను తవ్వాల్సి ఉంది. అయితే, పనులు కొంతవరకు జరిగినా పర్యావరణానికి నష్టం జరుగుతుందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పరిహారం కోసం రైతులు కోర్టుమెట్లక్కడంతో అది ముందుకుపడడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడో టీఎంసీపైనా ఫోకస్ పెట్టింది.
మూడో టీఎంసీని పూర్తి చేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీలకు నీటి సరఫరాతో పాటు సిటీ తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నది. ఇండస్ట్రీలకు నీటిని సరఫరా చేస్తే రెవెన్యూ జనరేట్అవుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మూడో టీఎంసీ పనులు ఎంతవరకయ్యాయి? ఇంకా ఎంత పెండింగ్ ఉందన్న దాని మీద వర్కవుట్ చేయాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలిసింది. పది పదిహేను రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రతిపాదనలపైనా ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు.
ప్యారలల్‌గా తుమ్మిడిహెట్టి కూడా..
మేడిగడ్డ రిపేర్లకు సమాంతరంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ పనులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే డీపీఆర్ తయారీ బాధ్యతలను దక్కించుకున్న ఆర్వీ అసోసియేట్స్.. బ్యారేజీ ప్రాంతంలో స్టడీలు చేస్తున్నది. మూడు నెలల్లో డీపీఆర్‌ను సమర్పించేలా సంస్థకు గడువు విధించగా.. ఆ గడువుకు తగ్గట్టుగా డీపీఆర్‌ను సంస్థ పూర్తి చేసే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.
బ్యారేజీ నిర్మాణం పూర్తయ్యాక.. అక్కడి నుంచి నీటిని తీసుకొచ్చి సుందిళ్లకు అటు నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇప్పుడు ఇటు తుమ్మిడిహెట్టి, అటు మేడిగడ్డ రిపేర్లు పూర్తయితే.. ఆ రెండింటి కాంబినేషన్లో జలాలను వాడుకునే యోచనలో ఉన్నది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి అది కుంగిపోయే వరకు 160 టీఎంసీలనూ ఎత్తిపోసింది లేదు. ఈ క్రమంలోనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఇటు తుమ్మిడిహెట్టి, అటు మేడిగడ్డ నుంచి వీలైనంత ఎక్కువ లబ్ధి పొందేలా ప్రణాళికలను రెడీ చేస్తున్నారు.
