గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినా.. పథకాలు అమలు చేస్తున్నం: మంత్రి వివేక్
- మహిళలు తలుచుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారు
- భవిష్యత్తులో ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగాలని సూచన
- సిద్దిపేట జిల్లాలోఇందిరమ్మ చీరల పంపిణీ
సిద్దిపేట/గజ్వేల్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు: మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వారిని అన్ని రంగాల్లో బలోపేతం చేసేందుకు కృషి చేస్తోందని తెలిపారు. శనివారం గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, నర్సాపూర్‌లో ఇందిర మహిళా శక్తి చీరలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ హయాంలో నాసిరకం బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తే.. తమ ప్రభుత్వం క్వాలి టీతో తయారు చేయించి మహిళలకు అందజేస్తోందని చెప్పారు.
మహిళలు తలచుకుంటే అన్ని రంగాల్లో విజ యాలు సాధిస్తారని.. భవిష్యత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ప్రభుత్వం ఇచ్చే లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సిద్దిపేట జిల్లాకు ఇప్పటివరకు 11 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. వాటిలో తొమ్మిది వేల ఇండ్లకు మొదటి విడత రూ. లక్ష లబ్ధిదారుల అకౌంట్‌లో డిపాజిట్ అయ్యాయన్నారు.
మరో విడతలో జిల్లాకు 3,500 ఇండ్లు మంజూరు చేసి, అర్హులందరికీ పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం ఖాళీ చేసినా.. తమ ప్రభుత్వం పట్టుదలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ‘మహిళా శక్తి’ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తోడ్పాడు అందిస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రోస్టర్ విధానంలో రిజర్వేషన్లు ఉంటాయని.. దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
పార్టీపరంగా 42 శాతం సీట్లను బీసీలకు కేటాయించాలని నిర్ణయించిందని, లోకల్ బాడీలకు నిధులు, అధికారం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నందున ఈ విషయంపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం అక్బర్‌పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామంలోని పెద్దచెరువులో, నర్సాపూర్ పట్టణ పరిధిలోని రాయరావుచెరువులో మంత్రి చేప పిల్లలను వదిలారు. మల్లన్న సాగర్ వద్ద 53 ఎకరాల్లో ఫిష్ పాండ్ ఏర్పాటు చేసేలా మత్స్య శాఖ మంత్రితో మాట్లాడుతానని చెప్పారు.
మా నాన్న నాకు రూ. 5 లక్షలు ఇచ్చారు
‘మా నాన్న నాకు రూ.5 లక్షలు ఇచ్చి స్వశక్తితో ఎదగమని చెప్పారు. నేను 40 ఏండ్లు ఎంతో కష్టపడి ఎన్నో బిజినెస్‌లు చేసి ఆ రూ.5 లక్షలు రూ.2వేల కోట్లకు చేరేలా చేశాను’ అని మంత్రి వివేక్ చెప్పారు. తాను బిజినెస్‌ల కోసం తీసుకు న్న లోన్లను సకాలంలో చెల్లించడం వల్లే నాపై బ్యాంకులకు నమ్మకం పెరిగి తోడ్పాటు అందిం చాయని, అందరూ అలాగే చేస్తే మరింత వృద్ధిలోకి వస్తారన్నారు.
