
డబ్బుల్లేక దివాలాకు చేరువ అవుతున్న ప్రభుత్వరంగ టెల్కోలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లను గట్టెక్కించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. వీటిని రక్షించడానికి రూ.74 వేల కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిధులతో ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎగ్జిట్ ప్యాకేజీ ఇస్తారు. ఎక్కువ మంది స్వచ్ఛందంగా విరమణ చేసేందుకు అదనంగా ఐదుశాతం ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. 4జీ స్పెక్ట్రమ్‌ను దక్కించుకునేందుకు, క్యాపిటల్ అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తారు. మనదేశంలో అత్యధిక నష్టాలు ఉన్న ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.13,804 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఇక ఎంటీఎన్‌ఎల్ రూ.3,398 కోట్ల నష్టాలతో రెండోస్థానంలో ఉండగా, ఎయిర్ ఇండియా మూడోస్థానంలో నిలిచింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ను రక్షించడానికి కేంద్రం పంపిణీ చేసిన కేబినెట్ నోట్లోని వివరాల ప్రకారం.. ఈ కంపెనీకి రూ.20 వేల కోట్ల విలువైన 4జీ స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తారు. 4జీ నెట్‌వర్క్ విస్తరణకు మరో రూ.13 వేల కోట్లు కేటాయిస్తారు. వీఆర్‌ఎస్ ప్యాకేజీ, ముందస్తు రిటైర్‌మెంట్ ప్రయోజనాల కోసం రూ.40 వేల కోట్లు ఇస్తారు.
మూసివేస్తే ఇబ్బందే
తీవ్రనష్టాల్లో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌లో వందశాతం వాటాలను అమ్మాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లను మూసివేస్తే రూ.1.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని టెలికంశాఖ వాదిస్తోంది. టెలికం పరిశ్రమ ఇబ్బందుల్లో ఉన్నందున బీఎస్‌ఎన్‌ఎల్‌లో వాటాల అమ్మకానికి (డిజిన్వెస్ట్‌మెంట్)స్పందన రాకపోవచ్చని తెలిపింది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడం వల్ల మేలు కలిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
త్వరగా రిటైర్‌మెంట్
ఈ రెండు టెల్కోల నష్టాలకు ప్రధాన కారణంగా అధిక జీతాల చెల్లింపే అని భావిస్తున్న ప్రభుత్వం రిటైర్‌మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలని కోరుకుంటోంది. ఇందుకోసం అధిక ప్రయోజనాలు ఉన్న వీఆర్‌ఎస్ (వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్)ను ప్రకటించనుంది. జీతభత్యాల చెల్లింపులు తగ్గడం వల్ల ప్రత్యర్థుల మాదిరే బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లు పోటాపోటీగా ప్యాకేజీలు ప్రకటించగలుగుతాయి. అంతేగాక టవర్ల, భూములు, ఆప్టికబ్ ఫైబర్‌ను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది.
జీతాలకూ ఇబ్బందే
జూన్ నెల వేతనాల కింద 1.76 లక్షల మంది ఉద్యోగులకు బీఎస్‌ఎన్‌ఎల్ రూ.850 కోట్లు చెల్లించాలి. డబ్బులు లేకపోవడంతో చేతులెత్తేసింది. ఈ కంపెనీకి ఇప్పటికే సుమారు రూ.13 వేల కోట్లు అప్పు ఉంది. వెంటనే అవసరమైనంత ఈక్విటీ ఇవ్వకపోతే బీఎస్‌ఎన్‌ఎల్ ఆపరేషన్స్ కొనసాగించడం కష్టమవుతుందని సంస్థ కార్పొరేట్ బడ్జెట్, బ్యాంకింగ్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ పూరణ్ చంద్ర చెప్పారు. ఆర్థిక సంక్షోభంతో ఫిబ్రవరి నెలలో తొలిసారి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మరోసారి జీతాలు చెల్లించడానికి డబ్బుల్లేవని ప్రకటించింది. కుదేలవుతోన్న తమ కంపెనీ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. సంస్థ ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందని, గతసారి కూడా ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఇబ్బందులు పడిందని చంద్ర వివరించారు.
వెనకబడడానికి కారణాలు ఇవి:
దాదాపు దశాబ్దకాలంగా బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎన్‌లు నష్టాల బాటలో నడుస్తున్నాయి
కంపెనీ నిర్వహణ అధ్వానంగా ఉంది. జియో రాక తరువాత పోటీని తట్టుకోవడంలో బీఎస్‌ఎన్‌ఎల్ విఫలమైంది.
ఆదాయంలో అత్యధిక మొత్తం జీతభత్యాలకే వెచ్చించాల్సి వస్తోంది. జీతాల చెల్లింపునకు 21 శాతం ఆదాయం వెచ్చిస్తున్నారు.
ప్రభుత్వం చాలా సందర్భాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని సమస్యలు సృష్టించిందనే విమర్శలూ ఉన్నాయి.
ప్రత్యర్థి కంపెనీలు 5జీ టెక్నాలజీ వైపు చూస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టెక్నాలజీనే పూర్తిస్థాయిలో తీసుకురాలేకపోతోంది.
ఇతర టెల్కోల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (వినియోగదారుడి నుంచి అందే సగటు మొత్తం) రూ.70 ఉండగా, బీఎస్‌ఎన్‌ఎల్ వాటా రూ. 38 దాటడం లేదు.