ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

గండిపేట, వెలుగు: మణికొండ మున్సిపాలిటీ నిధులు రూ. కోటి 70 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ స్కూల్ ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడా మున్సిపల్ నిధులతో స్కూళ్లను ఏర్పాటు చేయలేదని.. మణికొండలో మొదటిసారిగా ఇలా నిర్మించారన్నారు. నిర్మాణానికి కృషి చేసిన మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్, ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్లు, కమిషనర్​ను ఆమె అభినందించారు. మణికొండలో ప్రభుత్వ జూనియర్ కాలేజీని సైతం ఏర్పాటు చేయాలని వైస్ చైర్మన్ కె. నరేందర్ రెడ్డి మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఆమె తొందరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణకుమార్,   డీఈవో సుశీంద్రరావు, ఎంఈవో రాంరెడ్డి, ప్రైమరీ స్కూల్‌ హెడ్ మాస్టర్   మంగ్యా నాయక్, జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ నిరంజన్, టీచర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.

ఎస్టీపీ పనుల్లో వేగం పెంచాలి

సికింద్రాబాద్, వెలుగు: సిటీ శివార్లలోని  నల్ల చెరువు, పెద్ద చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్)లను వాటర్​బోర్డ్ ఎండీ దానకిశోర్ బుధవారం సందర్శించారు. మొదట పెద్ద చెరువును సందర్శించిన ఆయన.. ఐఎన్‌డీ, ఇన్ లెట్ తదితర పురోగతి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగంగా పూర్తి చేసి మార్చిలోపు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్టీపీల్లో భాగమైన ఐఎన్డీ, వెట్ వెల్, ఇన్ లెట్‌, అవుట్ లెట్ తదితర నిర్మాణ పనులు ఏకకాలంలో చేపట్టడం ద్వారా వేగంగా పూర్తి చేయవచ్చని సూచించారు. కార్మికుల రక్షణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నల్ల చెరువు ఎస్టీపీ వద్దకు వెళ్లి అక్కడి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఈడీ సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఎస్టీపీ సీజీఎం, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మెట్రో అధికారులతో చర్చలు విఫలం

  • డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తాం

  • రెడ్ ​లైన్​ మెట్రో టికెటింగ్ ఉద్యోగులు

హైదరాబాద్/ఉప్పల్, వెలుగు: మెట్రో రైల్ ​రెడ్​లైన్ టికెటింగ్ ఉద్యోగుల సమ్మె రెండో రోజూ కొనసాగింది. బుధవారం నాగోల్​లోని ఎన్‌సీసీ ఆఫీస్ ​ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోసారి మెట్రో అధికారులు వారితో చర్చలు జరపగా కేవలం రూ.800 పెంచుతామని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు. సమ్మెను కొనసాగిస్తామని, గురువారం రెడ్ ​లైన్​తో పాటు బ్లూ, గ్రీ లైన్లలోని టికెటింగ్​సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటారని వెల్లడించారు. కాగా కాంట్రాక్ట్ బేసిస్‌లో కాకుండా తమకు డైరెక్ట్ ఎంప్లాయ్​మెంట్ ఇవ్వాలని మెట్రో సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. శాలరీని 18 వేలకు పెంచాలని, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఏటా 10 నుంచి 15శాతం ఇంక్రిమెంట్, సిక్‌ లీవ్‌లు, వీక్లీ ఆఫ్‌లు సరిగా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. లంచ్ బ్రేక్ టైమ్​ని 15 నుంచి 30 నిమిషాలకు పెంచాలని కోరుతున్నారు. తాము ఉండే ఏరియాలోని స్టేషన్లలోనే డ్యూటీ చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తొలస్తామని మెట్రో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తు
న్నారు.