మహబూబ్‌నగర్‌ జిల్లాలో బిల్లులు ఇవ్వలేదని బడికి తాళం

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బిల్లులు ఇవ్వలేదని బడికి తాళం

మిడ్జిల్, వెలుగు : చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదన్న కారణంతో ఓ కాంట్రాక్టర్‌ స్కూల్‌కు తాళం వేశాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కంచనపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌ ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీతో కలిసి ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ, నీటి సరఫరా, టాయిలెట్‌ నిర్మాణ పనులు చేపట్టారు. మొత్తం రూ. 23 లక్షల విలువైన పనులు చేపట్టగా.. రూ. 19 లక్షలు మంజూరు కాగా మరో రూ. 4 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి.

ఏండ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో ఆగ్రహానికి గురైన ఆంజనేయులు బుధవారం స్కూల్‌ గేటుకు తాళం వేశాడు. బిల్లులు చెల్లించాలని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని, అప్పులకు మిత్తీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గేట్‌కు తాళం వేయడంతో టీచర్లు, స్టూడెంట్లు బయటే వేచి ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గీతాంజలి సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్‌ స్కూల్‌ గేటు తాళం ఓపెన్‌ చేశారు.