
- స్కూల్ కు వచ్చినా అటెండెన్స్ పడక ఇబ్బందులు
- కొన్నిచోట్ల సిగ్నల్ ప్రాబ్లమ్స్
- ఇంకొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ సరిగా చేయక సమస్యలు
- తాజాగా జిల్లాను విజిట్ చేసిన స్టేట్ టెక్నికల్ ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అటెండెన్స్ అమలుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్నిచోట్ల టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ పై సరైన అవగాహన లేక ఇబ్బందులు ఎదురవుతుండగా, ఇంకొన్నిచోట్లా ఎన్రోల్మెంట్, సర్వర్, సిగ్నల్ ప్రాబ్లమ్స్ తో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని కొన్ని స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తక్కువగా నమోదు అవుతోంది. ఇటీవల హనుమకొండ జిల్లాలోని వివిధ స్కూళ్లను సడెన్ విజిట్ చేసిన క్రమంలో కలెక్టర్ స్నేహ శబరీశ్ ఈ విషయాన్ని గుర్తించి, స్టేట్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయి సమస్యలపై స్టడీ చేసిన ఆఫీసర్లు స్టూడెంట్ల హాజరును పక్కాగా నమోదు చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నారు.
అన్ని స్కూళ్లలో అమలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నీ కలిపి 3,135కిపైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిల్లో సుమారు 1.94 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల హాజరులో కచ్చితత్వంతోపాటు ఎప్పటికప్పుడు స్టూడెంట్ల సంఖ్యను మానిటర్ చేసేలా రెండేండ్ల కిందట ఫేస్ రికగ్నిషన్ సిస్టంను అమలులోకి తెచ్చింది. యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్)లో నమోదై ఉన్న వివరాలను ఎఫ్ఆర్ఎస్ యాప్ తో సింక్రోనైజ్ చేసి, ఫోన్ లోనే విద్యార్థుల ముఖాలను క్యాప్చర్ చేసి అటెండెన్స్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని స్కూళ్లలో ఈ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారానే విద్యార్థుల డిజిటల్ హాజరు తీసుకోవడంతోపాటు పాఠ్యపుస్తకాలు అందించడం, ఏరోజుకారోజు నమోదైన విద్యార్థుల సంఖ్యను బట్టే మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు చేపట్టారు.
అటెండెన్స్ లో సమస్యలు..
ఎఫ్ఆర్ఎస్ వినియోగంలో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఎఫ్ఆర్ఎస్ యాప్ లో విద్యార్థుల ఫొటో క్యాప్చర్ చేయడం, అటెండెన్స్ తీసుకోవడంపై టీచర్లకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. దీంతో సెల్ ఫోన్ వినియోగం పెద్దగా తెలియని కొందరు టీచర్లు విద్యార్థులను గజం దూరంలో నిలబెట్టి ఫొటోలు క్యాప్చర్ చేశారు. ఫలితంగా ఎఫ్ఆర్ఎస్ యాప్ విద్యార్థులను గుర్తించక కొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతుండగా, స్టూడెంట్స్ బడికి వచ్చినా హాజరు పడని పరిస్థితి నెలకొంటోంది.
సిగ్నల్ ప్రాబ్లమ్స్ కూడా సమస్యగా మారగా, పిల్లల ఫొటో క్యాప్చర్ కు నిమిషాల కొద్దీ సమయం పడుతోందని టీచర్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ మారిన సమయంలో విద్యార్థి యూడైస్ వివరాలను డ్రాప్ బాక్స్ లో వేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని స్కూల్స్ అలా చేయకపోవడం వల్ల కూడా విద్యార్థి మారిన స్కూల్ లో కూడా హాజరు పడని పరిస్థితులున్నాయి. దీంతో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని క్షేత్రస్థాయి టీచర్లు చెబుతున్నారు.
ప్రాబ్లమ్స్ పై స్టేట్ ఆఫీసర్ల స్టడీ..
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ స్కూళ్లను విజిట్ చేసే క్రమంలో ఎఫ్ఆర్ఎస్ లో పలు సమస్యలను గుర్తించారు. టీచర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆయా సమస్యలను ఎఫ్ఆర్ఎస్ స్టేట్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇటీవల ఇద్దరు టెక్నికల్ ఆఫీసర్లు జిల్లాలోని మడికొండ, రాంపూర్, ఎల్కతుర్తి స్కూళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాంకేతిక సమస్యలతో పాటు అటెండెన్స్ తీసుకోవడంలో తలెత్తుతున్న ఇబ్బందులను గుర్తించారు. ఈ మేరకు విద్యార్థుల రిజిస్ట్రేషన్ నుంచి హాజరు తీసుకోవడం వరకూ అవగాహన కల్పించారు. అయినా కొన్నిచోట్ల ఇబ్బందులు తప్పడం లేదని కొందరు టీచర్లు చెబుతున్నారు. అవసరమైన టీచర్లకు అవగాహన కల్పించడంతోపాటు సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఎఫ్ఆర్ఎస్ పక్కాగా అమలు చేస్తున్నం..
జిల్లాలోని ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ లో సమస్యలు తలెత్తడంతో ఇటీవల స్టేట్ ఆఫీసర్లు పరిశీలించారు. ఇక్కడి టీచర్లకు అవగాహన కూడా కల్పించారు. ఎఫ్ఆర్ఎస్ లో తప్పనిసరిగా అటెండెన్స్ నమోదు చేసేలా టీచర్లకు కూడా సూచిస్తున్నాం. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.- డి.వాసంతి, డీఈవో, హనుమకొండ