ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతిముఖ్యమైన కాస్మోటిక్స్, వైద్యపరికరాల లిస్టును తయారు చేసే బాధ్యతను ఎన్‌ఎల్‌ఈఎం కొన్ని సబ్-కమిటీలకు అప్పగించింది. ఇవి త్వరలోనే నివేదికను సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ఈ లిస్టులోని ప్రొడక్ట్స్ మరింత నాణ్యతతో చౌకగా లభిస్తాయి.
న్యూఢిల్లీ:పరిశుభ్రత కోసం వాడే సబ్బులు, అడల్ట్ డైపర్లు, శానిటరీ నాప్కిన్లను (హైజీన్ ప్రొడక్ట్స్) ఇక నుంచి మరింత నాణ్యతతో, తక్కువ ధరలో అందించేందుకు వీటిని నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం)లో చేర్చే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో చేర్చాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఇది వరకే గుర్తించింది. ఇవి అంతటా, అన్ని వేళలా అందుబాటులో ఉండేలా చూడాలని భావిస్తోంది. హాస్పిటల్ హ్యాండ్ గ్లోవ్స్, ఆపరేషన్ థియేటర్ గమ్‌బూట్స్, ఫ్లోర్‌ను శుభ్రం చేసే లిక్విడ్స్‌ను కూడా ఈ జాబితాలో చేర్చాలని అనుకుంటున్నది. ఆరోగ్య సంరక్షణకు అత్యంత ముఖ్యమైన మందులు, వైద్య పరికరాలు, ఇంజెక్షన్ల వంటి డిస్పోజబుల్స్, హెల్త్, హైజీన్ ప్రొడక్ట్స్‌ను గుర్తించడానికి ఎన్‌ఎల్‌ఈఎం కమిటీ గత సెప్టెంబరులో కొన్ని సబ్–కమిటీలను నియమించింది. ఈ కమిటీ ఇది వరకే అత్యవసర మందులు, హైజీన్ ప్రొడక్ట్స్ జాబితా తయారు చేసే పనిని దాదాపు పూర్తి చేసింది. త్వరలోనే ఈ లిస్టును రెండో కమిటీకి అందజేయనుంది. నీతి ఆయోగ్ వైస్–చైర్మన్ రాజీవ్ కుమార్, ఆరోగ్యమంత్రిత్వశాఖ కార్యదర్శి ప్రీతి సూదన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మా కార్యదర్శి పీడీ వాఘేలా ఇందులో సభ్యులు. మొదటి కమిటీ సిఫార్సు చేసిన వస్తువుల్లో వేటిని ఎన్‌ఎల్‌ఈఎంలో చేర్చాలనే విషయమై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ జాబితాలో ఉన్న వస్తువుల ధరలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తారు. నేషనల్ ఫార్మా ప్రైజింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) సూచించిన ధరలకే తయారీ కంపెనీలు అమ్మాల్సి ఉంటుంది.
రెడీ అవుతున్న డ్యూయల్ ఏపీఐల జాబితా
మెడిసిన్స్‌తోపాటు బలవర్ధక ఆహారపదార్థాల తయారీకి వాడే డ్యూయల్ ఆక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు) దుర్వినియోగం కాకుండా చూసేందుకు వీటి ప్రభుత్వం వీటిని లిస్టును తయారు చేస్తోంది. రిజిస్టర్ కాని విదేశీ కంపెనీల నుంచి వీటిని స్థానిక కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. వీటిలో నాణ్యత తక్కువ కాబట్టి ధరలూ తక్కువగానే ఉంటాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆఫీసర్లు చెప్పారు. నాణ్యత తక్కువ ఉన్న ఏపీఐలను దిగుమతి చేసుకున్న కంపెనీలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇండియా దిగుమతి అవుతున్న ఏపీఐల్లో 80 శాతం చైనా నుంచే వస్తున్నాయి. ఇక నుంచి వీటిని కొనే కంపెనీ ఏపీఐలను ఏ మందు వాడకానికి ఉపయోగిస్తారో పేర్కొంటూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని వల్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయవచ్చని ఒక ఆఫీసర్ చెప్పారు.
నిపుణులతో సంప్రదింపులు
‘‘ఏ రకమైన సబ్బులను హైజీన్ కేటగిరీలోకి తీసుకురావాలనేదానిపైనా సమాలోచనలు జరుపుతున్నాం. మెడికేటెడ్, లిక్విడ్ సబ్బులను, వాష్‌లను ఈ విభాగంలోకి తేవాలనే వాదనలు ఉన్నాయి. ఇందుకోసం మైక్రోబయాలజిస్టుల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నాం. సాధారణ, పౌడర్ ఆధారిత, లూబ్రికేటెడ్ గ్లోవ్స్‌లో దేనిని ఎన్‌ఎల్‌ఈఎం లిస్టులో పెట్టాలనే విషయంపైనా సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని సంబంధిత ఆఫీసర్ ఒకరు చెప్పారు. ఇప్పటికే అత్యవసర మందులను ధరల నియంత్రణ విధానంలో ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ధరలను అదుపులో ఉంచాల్సిన మందుల జాబితాను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తయారు చేస్తుంది. ఈ జాబితాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ షెడ్యూల్–1లో చేర్చుతుంది. ఎన్‌పీపీఏ ఈ మందుల ధరలను నిర్ణయిస్తుంది. వైద్య పరికరాలకు సైతం ఇదే రూల్ వర్తిస్తుంది. ఎన్‌పీపీఏలో లేని మందుల ధరలను ఏడాదికి గరిష్టంగా 10 శాతం పెంచుకోవచ్చు. ఎన్‌ఎల్‌ఈఎంలో మందులను, వైద్యపరికరాలను చేర్చాలా, తొలగించాలా అనే విషయమై నిర్ణయం తీసుకోవడానికి కమిటీలు ప్రతి మూడేళ్లకు ఒకసారి సమావేశమవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గత ఏడాది అత్యవసర మందుల జాబితాను విడుదల చేసింది.
