
ముషీరాబాద్, వెలుగు: ఖాళీ ప్రభుత్వ జాగాలను విక్రయించకుండా, ఆట స్థలాలుగా మార్చాలని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కోరారు. క్రీడలను ప్రోత్సహిస్తూ భవిష్యత్తరాలకు ఉపయోగపడేలా చూడాలన్నారు. నివి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో గాంధీనగర్కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘంటసాల మైదానంలో ఏర్పాటు చేసిన అండర్14 క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం కిషన్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
సిటీలో ప్లే గ్రౌండ్స్ కొరత తీవ్రంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీతోపాటు కొన్ని కాలనీ సంఘాలు ప్లే గ్రౌండ్ లను పార్కులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్కులతోపాటు పిల్లలకు ఆట స్థలాలు అవసరమన్నారు. కార్పొరేటర్లు పావని, రచనశ్రీ, గుండగోని భరత్ గౌడ్, వినయ్ కుమార్, నవీన్ కుమార్, రత్న సాయిచంద్, శ్రీకాంత్, దామోదర్, రాజు, ఉమేశ్, పాల శ్రీను, సురేందర్, ఆనంద్ రావు, సాయికుమార్, హనుమంతు, యాదగిరి, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.