- లీటర్‌కు రూ. 6.50 కమీషన్.. గుడ్‌విల్ కింద ఏటా రూ. 5 కోట్లు
- రూ. లక్షకు పైగా జీతం, ఐదేండ్ల లోపు సర్వీస్ ఉన్న వారికి వీఆర్‌ఎస్ ఇచ్చేలా చర్యలు
యాదాద్రి, వెలుగు : నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీ (నార్ముల్)ను గట్టెక్కించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా డెయిరీని టేకోవర్ చేసేందుకు ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారంగా మారిన, ఐదేండ్లలోపు సర్వీస్ ఉన్న సిబ్బందికి వీఆర్‌ఎస్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నార్ముల్‌కు ఉమ్మడి నల్గొండ, -రంగారెడ్డి జిల్లాలో 311 సొసైటీలు ఉన్నాయి. గతంలో పటిష్టంగా ఉన్న డెయిరీ.. ఇటీవల వివిధ కారణాలతో పాల బిల్లులు రూ. 24 కోట్లతో పాటు మొత్తంగా రూ. 70 కోట్లకు పైగా అప్పుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో డెయిరీని గట్టెక్కించేందుకు ఇటీవల మంత్రి వాకిటి శ్రీహరి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, డెయిరీ చైచ్‌పర్సన్ మధుసూదన్‌రెడ్డి గుజరాజ్‌కు వెళ్లి ఎన్‌డీడీబీ చైర్‌పర్సన్ మనీశ్ షాను కలిశారు. మదర్ డెయిరీని టేకోవర్ చేసేందుకు ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారు.
పాల సేకరణ మదర్ డెయిరీది.. విక్రయాలు ఎన్‌డీడీబీవి
రైతుల నుంచి పాల సేకరణ బాధ్యతను మదర్ డెయిరీ తీసుకుంటుండగా.. వాటి విక్రయాల బాధ్యత మాత్రం ఎన్‌డీడీబీ నిర్వహించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పాలను సేకరించినందుకు డెయిరీకి లీటర్‌కు రూ.6.50 చొప్పున కమీషన్ అందనుంది. అదే విధంగా మదర్ డెయిరీకి గుడ్‌విల్ కింద ప్రతీ యేటా రూ. 5 కోట్లు ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ ఒకే చెప్పింది. ఈ నెలలోనే తొలి విడతగా రూ. 10 కోట్లు, నెలాఖరుకు మరికొంత ఇవ్వనుంది. అలాగే పాల సేకరణను 23 వేల లీటర్ల నుంచి లక్ష లీటర్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
సీనియర్లకు వీఆర్‌ఎస్
మదర్ డెయిరీలో మొత్తం 585 మంది పనిచేస్తుండగా.. వీరికి నెలకు రూ. 1.80 కోట్లు చెల్లిస్తున్నారు. ఇందులో రూ. లక్షకు పైగా జీతాలు తీసుకుంటూ.. మరో ఐదేండ్లలో రిటైర్ అయ్యే వారికి వీఆర్‌ఎస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీఆర్‌ఎస్ తీసుకునే వాళ్లకు ఒకే సారి పెద్దమొత్తంలో ఇవ్వాల్సి ఉంటున్నందున ఎన్‌డీడీబీ టేకోవర్ చేసిన తర్వాత ఈ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
