
- లిస్టెడ్ కంపెనీల్లో ప్రమోటర్ వాటా 75 శాతానికి మించకూడదు
- సెబీ రూల్‌కు అనుగుణంగా వాటాలను విక్రయించనున్న కేంద్రం
- ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా
- ఇండియన్ ఓవర్‌సీస్, యూకో, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకుల్లో కూడా 90 శాతానికి పైగా వాటా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ), ఐదు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో కొంత వాటాను అమ్మాలని చూస్తోంది. సెబీ రూల్స్ ప్రకారం లిస్టెడ్ కంపెనీలలో ప్రమోటర్ల వాటా 75 శాతానికి మించకూడదు. ఈ రూల్‌కు అనుగుణంగా తన వాటాను తగ్గించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం ఈ సంస్థలలో 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ఇది సెబీ పరిమితి కంటే ఎక్కువ.
ఎల్‌ఐసీలో 3 శాతం వరకు..
ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. 2022లో ఐపీఓ ద్వారా 3.5 శాతం వాటాను మాత్రమే విక్రయించింది. ప్రస్తుతం ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.5.66 లక్షల కోట్లు. ప్రభుత్వం ఎల్‌ఐసీలో రాబోయే రెండు వారాల్లో 2.5–-3 శాతం వాటాను అమ్మొచ్చని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. దీని ద్వారా రూ.14 వేల నుంచి రూ.17 వేల కోట్లను సేకరించొచ్చని తెలిపారు. ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ప్రక్రియను మోతీలాల్ ఓస్వాల్, ఐడీబీఐ క్యాపిటల్ నిర్వహించే అవకాశం ఉంది.
సెబీ నిబంధనల ప్రకారం, ఎల్‌ఐసీ 10శాతం పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 2027 మే 16 నాటికి సాధించాలి. ఈ కంపెనీ షేర్లు బుధవారం 3.5 శాతం తగ్గి రూ.884 వద్ద ట్రేడవుతున్నాయి. బ్రాండ్ ఫైనాన్స్ 2025 ప్రకారం, ఈ కంపెనీ 13.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.20 లక్షల కోట్ల) విలువతో భారతదేశంలో నాలుగో అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది.
ఐదు ప్రభుత్వ బ్యాంకులలో డిస్‌ఇన్వెస్ట్‌మెంట్
ఎల్‌ఐసీతో పాటు, ప్రభుత్వం ఐదు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో తన వాటాను 75 శాతం లేదా అంతకంటే తక్కువకు తగ్గించాలని చూస్తోంది. ఈ బ్యాంకులు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ప్రభుత్వ వాటా 94.61శాతం), యూకో బ్యాంక్(90.95శాతం), పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ (93.85 శాతం), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(89.27శాతం), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (79.60శాతం). సెబీ నిబంధనల ప్రకారం, ఈ బ్యాంకుల్లో వాటాను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 75 శాతానికి తగ్గించుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాత్రమే ఈ గడువును పాటించే అవకాశం ఉంది. ఇతర బ్యాంకులు గడువును పొడిగించాలని కోరొచ్చు. కాగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1) లో రూ.1,593 కోట్ల నికర లాభం వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే ఇది 23% ఎక్కువ. ఇండియన్ ఓవర్సీస్ లాభం 30% పెరిగి రూ.1,051 కోట్లకు చేరింది.
ప్రభుత్వ బ్యాంకులకు రికార్డ్ లాభాలు..
జూన్ క్వార్టర్‌లో ప్రభుత్వం బ్యాంకులు రూ.44,218 కోట్ల రికార్డు లాభాన్ని సాధించాయి. గత సంవత్సరం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. బ్యాంకులు ఆర్థికంగా బలంగా ఉండడంతో ఈ టైమ్‌లో వాటాలు అమ్మి ఆదాయం పెంచుకోవాలని కేంద్రం చూస్తోంది. ఇందుకోసం మర్చంట్ బ్యాంకర్లను త్వరలో నియమించనుంది.