కొత్త వీసీల రిక్రూట్మెంట్​కు త్వరలో నోటిఫికేషన్

కొత్త వీసీల రిక్రూట్మెంట్​కు త్వరలో నోటిఫికేషన్
  •     వారం, పది రోజుల్లోనే ప్రక్రియను ప్రారంభించే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్​లర్ల(వీసీ) నియామకం కోసం ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. వీసీల కోసం ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన ప్రాసెస్ ను విద్యాశాఖ స్టార్ట్ చేసింది. విద్యాశాఖ పరిధిలో మొత్తం12 యూనివర్సిటీలున్నాయి. వీటిలో కొత్తగా వచ్చిన తెలంగాణ మహిళా యూనివర్సిటీతో పాటు ఆర్జీయూకేటీకి వీసీల నియామకం జరగలేదు.

తెలంగాణ యూనివర్సిటీ వీసీ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడటంతో ఆయన్ను తప్పించారు. మిగిలిన వీసీల మూడేండ్ల కాలపరిమితి మే నెలతో ముగియనున్నది. అయితే,ఈసారి యూనివర్సిటీల బలోపేతంపై దృష్టిపెట్టిన సర్కారు.. నిబంధనల ప్రకారం కాలపరిమితి లోపే కొత్తవారిని ఎంపిక చేయాలని భావిస్తోంది. దీంట్లో భాగంగా త్వరలోనే విద్యాశాఖ  నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నది.

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా అర్హులైన సీనియర్ ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. వాటిని స్ర్కూట్నీ చేసి సర్కారుకు రిపోర్టు ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీని నియమించనున్నది. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని ఆ సెర్చ్ కమిటీలు ఒక్కో వర్సిటీకి ముగ్గురి పేర్లను గవర్నర్​కు ప్రతిపాదిస్తారు. దాంట్లోంచి ఒకర్ని గవర్నర్ .. వీసీగా నియమించనున్నారు.