- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ లో చేప పిల్లల విడుదల
ఖమ్మం టౌన్, వెలుగు : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లకారం ట్యాంక్ బండ్ లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్తో కలిసి ఆయన చేప పిల్లలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరంలో అంతర్గతంగా పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా ఉండాలన్నారు. లకారం చెరువు బాగు చేస్తే ఖమ్మం నగర ప్రజలకు ఆహ్లాదంగా గడిపేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. వెలుగుమట్ల అర్బన్ పార్క్ ను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మత్స్యకారుల అభవృద్ధి కోసం ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేప పిల్లలు విడుదల చేస్తోందని తెలిపారు. లకారం ట్యాంక్ బండ్లో 82.500 చేప పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రమాదాల్లో మృతిచెందిన మత్స్య కార్మికులు కనకయ్య, మంగయ్య కుటుంబాలకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్ కింద రూ. 5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేశారు.
ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం
ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులకు తక్కువ పెట్టుబడి, దీర్ఘకాలం లాభాలు ఉంటాయని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రఘునాథపాలెం మండలంలో ఆయన పర్యటించారు. మంచుకొండలో నూతనంగా నిర్మించిన రైతుబజార్ కూరగాయల మార్కెట్ ను కలెక్టర్, సీపీతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు మంచుకొండలో పీహెచ్సీని ప్రారంభించారు.
