- సూపరింటెండెంట్ సహా, ఆర్ఎంవో, డ్యూటీ డాక్టర్, ఎంఎన్ఓ సస్పెన్షన్
- విచారణకు సర్కారు ఆదేశాలు, ఆసుపత్రిని విజిట్ చేసిన వైద్య విధాన పరిషత్ కమిషనర్
జడ్చర్ల/జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని పాత ఏరియా హాస్పిటల్లో సోమవారం మార్చురీలో డెడ్బాడీని కుక్క పీకుతున్న ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై విచారణకు ఆదేశించగా, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ మంగళవారం ఉదయం హాస్పిటల్‌ను విజిట్ చేశారు. విచారణలో సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గుర్తించారు.
హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో పాటు ఆర్ఎంవో హరినాథ్, డ్యూటీ డాక్టర్ మనీషా, డీఎన్ వో రవి ప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి నిర్వహణలో సూపరింటెండెంట్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వంద పడకల హాస్పిటల్లో మార్చురీ గదిని కాంట్రాక్టర్ అప్పగించారని తెలిపారు. కానీ, దానిని వినియోగంలోకి తీసుకురాలేదన్నారు. పాత ఏరియా హాస్పిటల్లో పోస్టుమార్టం నిర్వహించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఈ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి సీరియస్ అయ్యారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
సస్పెన్షన్‌ను రద్దు చేయాలి
హైదరాబాద్ : జడ్చర్ల ఘటనలో వైద్యుల సస్పెన్షన్‌ను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) అధ్యక్షుడు నరహరి, సెక్రటరీ జనరల్ లాలుప్రసాద్ రాథోడ్, ట్రెజరర్రవూఫ్మంగళవారం ఒక ప్రకటనలో ఖండించారు. డాక్టర్ల సస్పెన్షన్ ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం.. పోస్టుమార్టం నిర్వహించడం మాత్రమే వైద్యుల పని అని, మార్చురీ నిర్వహణ, భద్రత పర్యవేక్షణ తమ బాధ్యత కాదన్నారు.
