- ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- కిరాణాలే సురక్షా స్టోర్లు
- పరిశుభ్రతకు ప్రాధాన్యం
లాక్‌డౌన్ ను మరింత కాలం పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల వస్తువుల రవాణాకు ఆటంకాలు కొనసాగుతాయి. ఇటువంటి పరిస్థితులలో ప్రజలకు పూర్తి పరిశుభ్రమైన దుకాణాలను అందుబాటులోకి తేవడానికి దేశవ్యాప్తంగా 20 లక్షల సురక్షా రిటైల్ షాపులు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వీధుల్లోని కిరాణాలనే సురక్షా షాపులుగా మారుస్తారు. వీటిని పూర్తిగా శానిటైజ్ చేస్తారు. సోషల్ డిస్టెన్స్ రూల్స్ తూచ తప్పక పాటిస్తారు. ఈ ప్లాన్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలను రంగంలోకి దింపనుంది. సప్లై చెయిన్ సక్రమంగా ఉండేలా, వస్తువులు సమయానికి వచ్చేలా ఇవి చూస్తాయి. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం లో ఈ విధానాన్ని అమలు చేయడంపై కేంద్ర కన్జూమర్ ఎఫైర్స్ సెక్రెటరీ పవన్ కుమార్ అగర్వాల్ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో ఇటీవల చర్చించారు. రాబోయే 45 రోజుల్లో ఈ కార్యక్రమాన్నిపూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఒకటి లేదా రెండు రాష్ట్రాల్ లోని సురక్షా షాపులకు వస్తువులను అందజేయాలి. ఈ విషయమై అగ ర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ సురక్షా స్టోర్లను ఏర్పాటు చేస్తున్న విషయం నిజమేనని అన్నారు.
అన్ని రూల్స్ పాటించాల్సిందే..
రిటైల్ స్టోర్.. సురక్షా షాపుగా మారాలంటే అన్ని రకాల హెల్త్, సేఫ్టీ రూల్స్‌ను పాటించాలి. షాపు బయట కస్టమర్లు సోషల్ డిస్టెన్స్ పాటించడానికి వీలైనంత స్థలం ఉండాలి. దుకాణంలోకి వెళ్లేముందు, బయటికి వచ్చేటప్పుడు కచ్చితంగా శానిటైజర్ వాడాలి. సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. ఇందులో కిరాణా వస్తువులతో పాటు గృహోపకరణాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటివి కూడా అమ్ముతారు. ఈ కార్యక్రమం అమలు కోసం 50 ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో చర్చించామని సంబంధిత ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. ఈ షాపుల్లోని సిబ్బందికి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు శిక్షణ ఇస్తాయి. కరోనా వ్యాప్తించకుండా ఏమేం చేయాలో చెబుతాయి. ఇక్కడ శుభ్రతకు ప్రాధాన్యం ఉంటుందని సూచించడానికి.. దుకాణం ముందు ‘సురక్షా స్టోర్’ అనే బోర్డు ఉంచుతారు. శుభ్రతపై అవగాహన కల్పించడానికి షాపులోపల పోస్టర్లు అంటిస్తారు. సురక్షా సర్కిల్‌లోకి 50 వేల ఎస్‌ఎంఈలు, ఐదు వేల కమ్యూనిటీలు వచ్చేలా ప్రతి మాన్యుఫ్యాక్చరింగ్‌ప్లాంటు 10 ఎస్‌ఎంఈలను, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటుంది.

