
హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలోనూ వైద్య సేవలు అందించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ దవాఖానాల్లో మాదిరే రోగులకు పూర్తిగా ఉచిత సేవలు అందించేందుకు ఆయా కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరుపుతోంది. ఉస్మానియా, గాంధీ వంటి పెద్దాస్పత్రులకు రోగుల సంఖ్య పెరుగుతుండటం, బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల సిబ్బంది, డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ దిశగా ముందుకు సాగుతోంది. రాష్ర్టంలో19 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో 10 కాలేజీలు హైదరాబాద్ శివార్లలో, కరీంనగర్‌లో 2, నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. ఈ బోధనాస్పత్రుల్లో 10 వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బెడ్లను, అక్కడి వసతులను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఇదీ ఉపయోగం
ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వచ్చే రోగాలకు మాత్రమే ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు. మిగతా వాటికి డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో బోధనాస్పత్రులకు రోగులు వెళ్లడం లేదు. అనుభవజ్ఞులైన డాక్టర్లు, ప్రొఫెసర్లు, వైద్య పీజీ విద్యార్థులు, హౌజ్ సర్జన్లు, అన్ని రకాల వసతులున్నా.. అన్నీ నిరూపయోగంగా మారుతున్నాయి. సర్కారు ఆస్పత్రుల్లో మాత్రమే ఉచితంగా అందించే కొన్ని చికిత్సలను, ప్రైవేటు టీచింగ్ హాస్పిటళ్లలోనూ అందించడం ద్వారా రోగులను అక్కడికి డైవర్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానాల్లో డెలివరీ చేయించుకుంటేనే కేసీఆర్ కిట్, ప్రోత్సాహక నగదు ఇస్తున్నారు. ఈ పథకాన్ని ప్రైవేటు బోధనాస్పత్రుల్లో డెలివరీ చేయించుకున్న వారికీ వర్తింపజేస్తారు. ప్రస్తుతం అపెండిసైటిస్, హిస్టెక్టమీ తదితర జనరల్ సర్జరీలు, 130 రకాల చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద వీటిని లిస్టెడ్ చేసినా, ప్రైవేటులో ఆరోగ్యశ్రీ వర్తించకుండా నిబంధన విధించారు. ఈ 130 చికిత్సలను కూడా బోధనాస్పత్రుల్లో ఉచితంగా అందించాలని యోచిస్తున్నారు.
ప్రైవేటు కాలేజీలు సానుకూలం
ప్రభుత్వ ప్రతిపాదనను ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా పరిశీలిస్తున్నాయి. అయితే పూర్తిగా ఉచిత సేవలు కాకుండా, కొంత మొత్తాన్ని చెల్లించాల్సిందిగా కోరుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఒక రోగికి ఎంత వెచ్చిస్తున్నారో, అందులో 10 శాతం తమకు ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలిసింది. ఈ అంశం త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.