జీవో ఇచ్చారు.. కానీ పైసలియ్యలె

జీవో ఇచ్చారు.. కానీ పైసలియ్యలె
  • రూ.17,700 కోట్లకు జీవో ఇచ్చారు.. కానీ పైసలియ్యలె
  • దళితబంధు స్కీంకు వారం కింద బడ్జెట్ రిలీజ్..ఆర్డర్ ఇచ్చిన ఆర్థికశాఖ 
  • అయినా నిధులు విడుదల చేయకుండా అట్టే పెట్టుకున్న రాష్ట్ర సర్కార్


హైదరాబాద్, వెలుగు: దళిత బంధు పథకానికి రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ రూ.17,700 కోట్లకు బడ్జెట్‌‌‌‌ రిలీజ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ (బీఆర్వో) ఇచ్చింది. దీనికి సంబంధించి వారం రోజుల కిందట జీవో ఇచ్చినా.. ఉత్తర్వులను ప్రభుత్వ జీవోఐఆర్‌‌‌‌‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టలేదు. రాష్ట్రం వచ్చాక ఇంత పెద్ద మొత్తానికి బీఆర్వో ఇవ్వడం ఇదే మొదటిసారి అని అధికారులు చెప్తున్నారు. అయితే, నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందో తమకు తెలియదని అంటున్నారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 38,617 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందాల్సి ఉండగా, సగం మందికి కూడా రాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మందికి దళిత బంధు ఇస్తామని గత బడ్జెట్‌‌‌‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలై 45 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ ఒక్క రూపాయి జమ కాలేదు. 40 వేల మంది లబ్ధిదారులకు అమలు చేయడానికే ఏడాదికి పైగా టైమ్​ తీసుకుంటే.. మిగిలిన వాళ్లకు ఎప్పుడిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమైన పథకాలకు ఆర్థిక శాఖ బీఆర్వో ఇచ్చిన వెంటనే సంబంధిత శాఖ నుంచి అడ్మినిస్ట్రేటివ్ అనుమతుల ఉత్తర్వులిస్తారు. తర్వాత సర్కార్ నిధులను ఆ డిపార్ట్‌‌‌‌మెంట్ పీడీ అకౌంట్‌‌‌‌లో​జమ చేస్తుంది. దళిత బంధు జీవో ఇచ్చి వారమైనా.. ఇంతవరకు నిధులపై ఉలుకుపలుకు లేదని ఆఫీసర్లు అంటున్నారు. ఆర్థిక శాఖ అధికారులను అడిగితే.. జీతాలకే దిక్కులేదు.. దళిత బంధుకు ఇవ్వాలా..? అని ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. బీఆర్వో ఇచ్చారు కదా అని అడిగితే.. స్కీం ఆగిపోయిందనే అనుమానం రావొద్దని ఇచ్చాం.. అంత మాత్రాన నిధులు వచ్చేసినట్లు కాదని చెప్తున్నారు. 

హుజూరాబాద్‌‌‌‌ను మర్చిపోయిన్రు 

నిరుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా దళిత బంధు పథకాన్ని రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఆగస్టులో ఆ నియోజకవర్గంలో 18,211 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున సాయం అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్కడ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ స్కీం నెమ్మదించింది. ఇప్పటివరకు అక్కడ 9,747 మంది దళితులకు మాత్రమే యూనిట్లు గ్రౌండ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 100 మంది చొప్పున 11,835 మంది లబ్ధిదారులకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందులోనూ 6,574 మందికి మాత్రమే యూనిట్లు గ్రౌండ్ చేశారు. నిజాంసాగర్, చింతకాకని, చారగొండ, తిరుమలగిరి 4 మండలాల్లోనూ వంద శాతం మంది దళితులకు దళితబంధు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఈ 4 మండలాలకు సంబంధించి బడ్జెట్ ఉత్తర్వులు కూడా ఎప్పుడో ఇచ్చారు. ఈ మండలాల్లో 8,507 మంది లబ్ధిదారులను గుర్తించగా, 3 వేల మందికే యూనిట్లు గ్రౌండ్ చేశారు. ఒక్క వాసాలమర్రి గ్రామంలోనే పూర్తిస్థాయిలో యూనిట్లు మంజూరు చేశారు.