కందనూలు/నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మహనీయుల ఆశయాల సాధనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చైతన్యం కల్పించడమే ‘జ్ఞాన చైతన్య రథయాత్ర’ లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ మల్లు రవి చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’ బస్సుయాత్రను నాగర్ కర్నూల్ లోని బాబు జగ్జీవన్ రామ్ కమిటీ హాల్ వద్ద ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం ఈ యాత్ర తెల్కపల్లి, బిజినేపల్లి మండలాల గుండా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పేదలకు సన్న బియ్యం, ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, ఇందిరమ్మ ఇండ్లు, కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, వికలాంగులకు ట్రై సైకిళ్లు, మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, 75 వేల ఉద్యోగాల భర్తీ, రూ.500 కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా వంటి పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి అర్హుడికి ఈ ఫలాలు అందేలా చూసే బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు.
