
- సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
- పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
.సిరిసిల్ల టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేతన్న చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. విప్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల ఆమోదం తెలిపినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మీ చెక్కుల అందజేత
వేములవాడరూరల్, వెలుగు : పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలం పరిధిలోని కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,అర్హులైన 44 మందికి 14 లక్షల 20 వేల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా విప్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చినా కానీ ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క పథకాన్ని కూడా రద్దు చేయకుండా నూతన పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, ఎంపీడీవో శ్రీనివాస్, నాయకులు చిలుక ప్రభాకర్, వకుళాభరణం శ్రీనివాస్, రంగు వెంకటేశ్ గౌడ్, అడ్డిక జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.