- ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపిస్తే ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం, మాసాయిపేట, గౌరాయపల్లి, బాహుపేట, కాచారం, సాదువెల్లి, ధర్మారెడ్డిగూడెం, పెద్దకందుకూరు, రామాజీపేట, వంగపల్లి, చొల్లేరు గ్రామాలలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉండి గ్రామాలను పట్టించుకోని బీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాలను అభివృద్ధి చేయాలనే సోయి ఎందుకు లేదని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు కళ్లెం జహంగీర్ గౌడ్, చీర శ్రీశైలం, కాళ్లె లత, కన్నాయి రోజా, రాంరెడ్డి, శోభ, మధు, చిన్నం మమత, కాంగ్రెస్ జిల్లా నాయకుడు దుంబాల వెంకట్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, మాజీ వార్డు సభ్యురాలు కళ్లెం విజయ, మాజీ కౌన్సిలర్ మల్లేష్ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు సత్యప్రకాశ్ గౌడ్, మండల నాయకుడు కోల కృష్ణ గౌడ్ తదితరులు ఉన్నారు.

