
మెదక్, వెలుగు: వాణిజ్య పంటలైన ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, కూరగాయలు సాగుచేసే రైతులకు మైక్రో ఇరిగేషన్ పరికారలపై ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఈ మేరకు హార్టికల్చర్డిపార్ట్మెంట్2025-–-26 సంవత్సరానికి జిల్లాల వారీగా డ్రిప్, స్ప్రింక్లర్, మల్చింగ్ యూనిట్లకు లక్ష్యాలు ఖరారు చేసింది. ఆయిల్‌పామ్, పండ్లు, కూరగాయ తోటలు, వెదురుసాగుకు ఆసక్తి ఉన్న రైతులు సబ్సిడీ స్కీమ్‌లకు దరఖాస్తు చేసుకోవాలని హార్టికల్చర్ఆఫీసర్లు సూచిస్తున్నారు.
నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం ద్వారా జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ఏడాదికి 2,500 ఎకరాల్లో ఆయిల్పామ్తోటలు సాగు చేయించాలని లక్ష్యం కేటాయించారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా ఆయిల్పామ్సాగుచేసే రైతులకు డ్రిప్, స్ర్పింక్లర్ల ఏర్పాటుకు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఉంటుంది. ఆయిల్ పామ్ తోటలు సాగుచేసే రైతులకు ఇదివరకటిలాగే ఎకరానికి సంవత్సరానికి రూ.4,200 చొప్పున మొత్తం నాలుగేళ్లకు రూ.16,800 ఇవ్వడంతోపాటు, మొక్కలపై రూ.11,001- రాయితీ లభిస్తుంది.
రాష్ట్రీయ ఉద్యాన మిషన్ పథకం కింద బొప్పాయి, మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో సాగుకు రాయితీ లభిస్తుంది. హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా, పువ్వుల తోటల సాగుకు సబ్సిడీ ఉంది. కూరగాయలు సాగుచేసే రైతులకు సిద్దిపేట జిల్లా ములుగులోని సెంటర్ఆఫ్ఎక్సలెన్సీ నుంచి నాణ్యమైన హైబ్రిడ్ కూరగాయల నారు సరఫరా
చేస్తారు.
20 ఫార్మ్ పాండ్స్
వర్షాభావ పరిస్థితుల్లో పండ్ల తోటలకు, దీర్ఘకాలిక పంటలకు నీటి తడులు అందిచడం కోసం 20 x 20 x3 మీటర్ల సైజ్ గల 20 ఫార్మ్ పాండ్స్ (నీటి కుంటలు) నిర్మించేందుకు అవకాశం ఉంది. దీనికి రూ.75 వేల రాయితీ ఉంటుంది. మొక్కలకు అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు కలగజేసి నేల ఉష్ణోగ్రతలను నివారించడానికి, భూమిలో తేమ నిల్వ ఉంచడానికి మల్చింగ్ పద్దతి చాలా ఉపయోగకరం. ప్రస్తుతం 50 శాతం రాయితీపైన 85 ఎకరాలకు ప్లాస్టిక్ మల్చింగ్ అందుబాటులో ఉంది. మల్చింగ్ వేసుకున్న రైతులకు ఎకరానికి రూ.8 వేల సబ్సిడీ ఉంటుంది.
పందిరి సాగుకు..
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా తీగ జాతి కూరగాయలు పండించడానికి పందిళ్ల నిర్మాణానికి 50 శాతం రాయితీ ఇస్తారు. గరిష్టంగా ఒక రైతుకు 2.50 ఎకరాల వరకు, ఎకరాకు రూ.లక్ష రాయితీ సదుపాయం ఉంది. జిల్లాలో 50 ఎకరాల విస్తీర్ణంలో పందిళ్ల నిర్మాణానికి సబ్సిడీ మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర వెదురు మిషన్ ద్వారా రైతుకు అదనపు ఆదాయం చేకూర్చే విధంగా పొలం గట్ల మీద వెదురు సాగు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఇందుకు 50 శాతం రాయితీ (మొక్కకి రూ.90- చొప్పున) ఎకరాకు గరిష్టంగా130 మొక్కల వరకు రాయితీ సొమ్మును రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 1,500 మొక్కలను కేటాయించారు.
సద్వినియోగం చేసుకోవాలి
సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి ఉన్న రైతులు తమ పరిధిలోని ఉద్యాన అధికారులను లేదా మెదక్ కలెక్టరేట్లోని ఉద్యాన శాఖ జిల్లా ఆఫీసులో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా పండ్ల తోటలు పెట్టి రాయితీ పొందే రైతులు వారి పేర్లను సంబంధిత ఏఈవో వద్ద, రైతుబంధు పోర్టల్‌లో విధిగా నమోదు చేసుకోవాలి. మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట్, నిజాంపేట్, నార్సింగి, చేగుంట, తూప్రాన్ మండలాలకు సంబంధించిన రైతులు వివరాల కోసం హార్టికల్చర్ఆఫీసర్రచనను (8977714423), నర్సాపూర్, కౌడిపల్లి, కొల్చారం, చిన్న శంకరంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట, శివ్వంపేట్, మనోహరబాద్, చిలిపిచెడ్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడ్, పెద్దశంకరంపేట్ మండలాలకు సంబంధించిన రైతులు హార్టికల్చర్ఆఫీసర్సంతోష్ కుమార్ ను (8977714422) సంప్రదించాలి.
ప్రతాప్‌సింగ్, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్, మెదక్
పంట లక్ష్యం(ఎకరాల్లో) సాయం (రూ.లలో)
మామిడి 50 12,000
జామ 30 12,000
నిమ్మ 10 12,000
బొప్పాయి 25 30,000
డ్రాగన్ ఫ్రూట్ 10 1,08,000
అవకాడో 12.5 20,000
కూరగాయలు 75 9,600
ఉల్లిగడ్డ 12.5 8,000
పువ్వులు 25 8,000