ఫ్రూట్ మార్కెట్ కేసు పిటిషన్ వాపస్ తీసుకున్న సర్కార్

ఫ్రూట్ మార్కెట్ కేసు పిటిషన్ వాపస్ తీసుకున్న సర్కార్
  • ఉత్తర్వులు సవరించాలని హైకోర్టును కోరుతామని సుప్రీంకు వినతి

న్యూఢిల్లీ, వెలుగు: గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ వ్యవహారంపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​ను రాష్ట్ర ప్రభుత్వం వాపస్ తీసుకుంది. ఉత్తర్వులను సవరించాలని హైకోర్టును కోరతామని, అందుకు అనుమతించాలని సుప్రీం బెంచ్​ను ప్రభుత్వ తరఫు లాయర్ వైద్యనాథన్ కోరగా అందుకు ధర్మాసనం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. సౌలత్​లు కల్పించకుండా కొత్తపేటలో ఉన్న మార్కెట్‌‌‌‌ను బాటసింగారానికి తరలించడాన్ని తప్పుపడుతూ కమీషన్‌‌‌‌ ఏజెంట్లు, వ్యాపారులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు ఈ నెల18 దాకా మార్కెట్‌‌‌‌ను ఉన్న స్థలంలోనే కొనసాగించాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాష్ట్ర సర్కార్​ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్​ను జస్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా బెంచ్ శనివారం విచారించింది. మార్కెట్‌‌‌‌ స్థలంలో సూపర్‌‌‌‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకే మార్కెట్‌‌‌‌ను బాటసింగారం తరలిస్తున్నట్లు వైద్యనాథన్ వివరించారు.  అక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు అంతా బాగానే ఉన్నప్పుడు సమస్య ఏంటని ప్రశ్నిస్తూ.. పిటిషన్​ను డిస్మిస్ చేస్తామని చెప్పింది. సమస్యలుంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. కాగా, బెంచ్ ఆదేశాలతో తమ పిటిషన్​ను విత్ డ్రా చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ లాయర్ అంగీకరించారు.