- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు
మహబూబాబాద్/ కురవి/ పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. మంగళవారం మహబూబాబాద్జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని, మానుకోట జిల్లాలో గతంలో భారీ వర్షాల మూలంగా 159 చెరువులు, 8 చెక్ డ్యామ్ లు దెబ్బతిన్నప్పటికీ వాటిని రిపేర్ చేయలేదన్నారు.
జిల్లాలో స్వయంగా సీఎం పర్యటించినా ఇంతవరకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. ప్రతిరోజు ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల నుంచి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మరిపెడ, తొర్రూర్ పట్టణ కేంద్రాల్లోని పీహెచ్సీలను సీహెచ్సీలుగా అప్గ్రేడ్చేస్తూ 100 పడకల ఆస్పత్రి మంజూరు చేయగా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు.
నరసింహులపేట, పెద్ద వంగరలో పీహెచ్సీలకు డాక్టర్లనే నియమించలేదన్నారు. ఇటీవల జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చిన్నగూడూరు మండలం జయ్యారానికి చెందిన వెల్ధి రాజు అనారోగ్యంతో, ఆస్పత్రికి వస్తే బతికుండగానే మార్చురీలో పడేయడం దారుణమైన ఘటన అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం విద్యా రంగాన్ని సైతం విస్మరిస్తోందని అన్నారు. తక్షణం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు.
అనంతరం కురవి మండలం రాజోలుకు చెందిన తోట రవి ఇటీవల మృతిచెందగా మాజీ మంత్రి హరీశ్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, వివిధ మండలాల బిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్లలో రైతు సదానందం–శోభ పత్తి పంటను పరిశీలించి, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
