
హైదరాబాద్, వెలుగు: సమ్మెలో ఉన్న సెకండ్ఏఎన్ఎంలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రాష్ట్రంలో ఏఎన్ఎంలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా తమ ఉద్యోగాలను రెగ్యులరైజేషన్ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు.
అది సాధ్యం కాదని డీహెచ్ శ్రీనివాస రావు తేల్చిచెప్పారు. దాంతో వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. శనివారం ఏఎన్ఎం ప్రతినిధులతో ప్రభుత్వం మళ్లీ చర్చలు జరిపింది. ఈసారి కూడా వారి డిమాండ్లు పరిష్కరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు ఒప్పుకోలేదు. రిక్రూట్మెంట్లో వెయిటేజీ ఇస్తామని, పోస్టుల సంఖ్య పెంచుతామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. డీహెచ్ మాటలతో ఆగ్రహానికి గురైన ఏఎన్ఎంలు డీహెచ్ కార్యాలయ ఆవరణలోనే ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము రెగ్యులరైజేషన్ కోరుతుంటే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడమేంటని నిలదీశారు. వీఆర్ఏల కోసం 14 వేల పోస్టులు క్రియేట్ చేసిన ప్రభుత్వం సెకండ్ఏఎన్ఎంల కోసం క్రియేట్ చేయలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆందోళనలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు, ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ, నాయకులు రామాంజనేయులు, బడేటి వనజ, గాండ్ల మధురిమ తదితరులు పాల్గొన్నారు.