
- దేశానికి వికారాబాద్ జిల్లాను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి
- టీబీ ముక్త్ భారత్ కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలి
వికారాబాద్, వెలుగు: టీబీ ముక్త్ భారత్ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్ లో ట్యూబర్ క్యూలోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మూడో సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. వికారాబాద్‌కా హవా మరీజోంకి దవా అన్నారు. రాజకీయ నాయకులు, కవులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీతలు, రచయితలు తదితర వర్గాలకు చెందిన వారందరిని టీబీ నిర్మూలనలో భాగస్వామ్యం చేయాలని కోరారు.
సబ్ కా వికాస్- సబ్ కా ప్రయాస్ నినాదంతో టీబీ నిర్మూలనకు అందరు కష్ట పడితేనే ఫలితం ఉంటుందన్నారు. దేశానికి వికారాబాద్ జిల్లాను రోల్ మోడల్ గా తీర్చి దిద్దడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా టీబీ అధికారులు డాక్టర్ మల్లికార్జున్(మహబూబ్ నగర్), డాక్టర్ రాజు (జోగులాంబ గద్వాల్), డాక్టర్ సుమలత (ఆదిలాబాద్), డాక్టర్ పుల్లారెడ్డిలకు ప్రశంస పత్రాలు, గోల్డ్ మెడల్, మెమొంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్ పి. నారాయణ రెడ్డి, టీబీ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ప్రసాద్, దీన దయాళ్ బాగ్ డాక్టర్ నరేందర్, డాక్టర్బాల చందర్ తదితరులు పాల్గొన్నారు.