
- పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్‌ను స్టడీ చేస్తున్న గవర్నర్
- నేడు గవర్నర్కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం.. ఆమోదం లాంఛనమే!
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ యాక్ట్– 2018 సవరణ ఆర్డినెన్స్ పై గవర్నర్జిష్టుదేవ్వర్మ శుక్రవారం న్యాయసలహా కోరారు. రోజంతా రాజ్‌భవన్‌లోనే ఉన్న గవర్నర్రాష్ట్ర ప్రభుత్వం పంపిన పంచాయతీరాజ్చట్ట సవరణ ఆర్డినెన్స్ ఫైల్‌ను క్షుణ్ణంగా స్టడీ చేసినట్టు తెలిసింది. 2018 పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్285 (ఏ)లో రిజర్వేషన్లు 50 శాతం మించవద్దనే నిబంధన ఉండగా, దానిని ‘కులగణన సర్వేలోని ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి’ అని ఇటీవల ప్రభుత్వం మార్చింది. ఇలా మార్చిన ఆర్డినెన్స్ ముసాయిదా ను గవర్నర్కు పంపగా సవరణపై ఆయన లీగల్ ఒపీనియన్ కోరినట్టు తెలిసింది. న్యాయసలహా ఆధారంగా ఆర్డినెన్స్ పై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ గవర్నర్ వివరణ కోరితే క్లారిటీ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా నోట్స్సిద్ధం చేసి పెట్టుకున్నట్టు తెలిసింది. శనివారం రాజ్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేశ్ కుమార్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ యాక్ట్ సవరణ ఆర్డినెన్స్ కు సంబంధించి గవర్నర్కు సీఎం వివరించనున్నట్టు తెలిసింది. దీంతో ఆర్డినెన్స్ ఆమోదం లాంఛనమే అని అధికారవర్గాలు భావిస్తున్నాయి.
ఇప్పుడున్నదేమిటి.. సుప్రీంకోర్టు చెప్పిందేమిటి?
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్ 285ఏ.. గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదు. ఈ రిజర్వేషన్లపై నిర్ణయం ప్రభుత్వం నిర్దేశించాలని ఉంది. వాస్తవానికి సుప్రీంకోర్టులో 1992లో ఇంద్ర సాహ్నీ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో "అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే రిజర్వేషన్లు 50 శాతం మించాలని, అత్యంత జాగ్రత్తగా, ప్రత్యేక కారణాలు ఉంటేనే ఇది సమర్థనీయం ” అని కోర్టు స్పష్టం చేసింది. 2010లో "కె. కృష్ణమూర్తి వర్సెస్ భారత ప్రభుత్వం" కేసులో సుప్రీంకోర్టు స్థానిక స్వపరిపాలన సంస్థల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించింది. ఆర్టికల్ 243డీ ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంటుంది. 50 శాతం పరిమితి దాటలాంటే "అసాధారణ పరిస్థితులు" ఉండాలని మరోసారి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు 50శాతం పరిమితి మించితే ఎలాగూ కోర్టులు ఉంటాయి కనుక ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.