
గ్రూప్–1 అధికారులకు గవర్నర్ నరసింహన్ సూచన
హైదరాబాద్, వెలుగు: ప్రజల్లో గుణాత్మక మార్పును తెచ్చేందుకు గ్రూప్–1 సర్వీస్ అధికారులు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో శుక్రవారం గ్రూప్-1 అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలు, బాధలను అర్థం చేసుకునేందుకు కృషి చేయాలని, వారి సమస్యలు పరిష్కరించడంలో సానుభూతిని ప్రదర్శించాలన్నారు. బంగారు తెలంగాణ సాధనకు ఇది ముఖ్యమ న్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సానుకూలంగా ఉండరనే భావన ఉందని, దాన్ని దూరం చేసేలా విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. తర్వాత యువ అధికారుల హౌస్ జర్నల్ సొసైటీ రూపొందించిన ‘సవ్వడి’ జర్నల్‌ను గవర్నర్ విడుదల చేశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ డైరెక్టర్ జనరల్ బి.పి.ఆచార్య, అదనపు డైరెక్టర్ జనరల్ బి. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ షేక్ మహ్మ ద్ నబీ, ఆర్.మాధవి, పాల్గొన్నారు.