నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

నిరుద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
  •     టీజీపీఎస్సీకి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దిశానిర్దేశం
  •     నియామకాలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచన
  •     రాజ్ భవన్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని భరోసా
  •     గవర్నర్​ను కలిసిన కమిషన్  చైర్మన్, బృందం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా, అత్యున్నత ప్రమాణాలతో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని టీజీపీఎస్సీని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశించారు. నియామక వ్యవస్థపై ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగులకు ఉన్న నమ్మకాన్ని మరింత బలపరచాల్సిన బాధ్యత కమిషన్  పైనే ఉందని చెప్పారు. మంగళవారం లోక్ భవన్‌‌లో గవర్నర్​ను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. 

ప్రస్తుతం కొనసాగుతున్న రిక్రూట్‌‌మెంట్ ప్రాసెస్ లు, పారదర్శకత కోసం కమిషన్  ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల గురించి గవర్నర్‌‌కు వివరించారు. పరీక్షల నిర్వహణలో వేగం పెంచడంతో పాటు అక్రమాలకు తావులేకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను ఆయన వివరించగా, గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. 

ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, పూర్తిస్థాయిలో మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరగాలని సూచించారు. అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా క్యాండిడేట్ ఫ్రెండ్లీ విధానంలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. కమిషన్  తన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్ భవన్  నుంచి పూర్తి స్థాయి మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీజీపీఎస్సీ సభ్యులు పాల్వాయి రజనీ కుమారి, చంద్రకాంత్ రెడ్డి, సి.విశ్వప్రసాద్, కమిషన్ కార్యదర్శి ఎం.హరిత ఉన్నారు.