పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ తమిళిసై నివాళులు

పరేడ్ గ్రౌండ్లోని  అమరవీరుల స్థూపం వద్ద  గవర్నర్ తమిళిసై నివాళులు

 తెలంగాణ  ప్రభుత్వం కూడా విజయ్ దివస్ దినోత్సవాన్ని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో  నిర్వహించాలని గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు.  పాక్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివస్ను జరుపుకుంటామని తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని  అమరవీరుల స్థూపం వద్ద  గవర్నర్ తమిళిసై  పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

1971 యుద్ధంలో పాక్ పై భారత్ సాధించిన విజయానికి గుర్తు చేసుకుంటూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో విజయ్ దివస్ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ తమిళ్ సై సౌందర్య రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండో పాక్ వార్లో ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని గుర్తు చేశారు. వారందరిని  స్మరించుకుంటూ విజయ్ దివస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు.  ఈ విజయ దివస్ను తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జరపాలని సూచించారు. సైనికుల  త్యాగాలను ప్రతి విద్యార్థి,  ప్రతి యువత స్మరించుకునే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.