సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి..   స్టూడెంట్లకు గవర్నర్  తమిళిసై సూచన

సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి..   స్టూడెంట్లకు గవర్నర్  తమిళిసై సూచన

నల్గొండ అర్బన్, వెలుగు :  సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నిత్యం అధ్యయనంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్టూడెంట్లకు గవర్నర్  తమిళిసై సూచించారు. బుధవారం నల్గొండలో నిర్వహించిన ఎంజీయూ మూడో స్నాతకోత్సవానికి గవర్నర్  హాజరయ్యారు. ఓయూ మాజీ వీసీ ఎస్.రామచంద్రంతో కలిసి విద్యార్థులకు పీహెచ్​డీ పట్టాలు, బంగారు పతకాలను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్  మాట్లాడుతూ విద్య అంటే జ్ఞాన సముపార్జన మాత్రమే కాకుండా వ్యక్తి గుణాన్ని పెంపొందించుకోవడం, ఆధ్యాత్మిక వృద్ధి కూడా అని తెలిపారు.

విద్యార్థులు తమ తల్లిదండ్రులు చేసిన త్యాగాలకు కృతజ్ఞతగా ఉండాలన్నారు. కఠిన పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని గవర్నర్  ఉద్బోధించారు. ఓయూ మాజీ వీసీ ఎస్.రామచంద్రం మాట్లాడుతూ విద్యార్థులు తమ కెరీర్‌లో రాణించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్​చార్జి రిజిస్ట్రార్  అల్వాల రవి, సీఓఈ మిర్యాల రమేష్, పాలమూరు యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంత రాథోడ్, ఎంఎల్​సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎంజీయూ పూర్వ రిజిస్ట్రార్లు ముత్యంరెడ్డి, యాదగిరి, కృష్ణారావు, పాలక మండలి సభ్యులు, డీన్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.