సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన గవర్నర్

సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన గవర్నర్
  • 24న యూనివర్సిటీలపై రివ్యూ..
  • తర్వాత వైద్య శాఖపై సమీక్ష
  • నేరుగా ప్రజలను కలవనున్న తమిళిసై
  • శాఖల పనితీరుపైనా నజర్
  • ఇంటర్ ఫలితాల వివాదంపై ఆరా

హైదరాబాద్, వెలుగు:

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజ్​భవన్​ తలుపులు తెరుచుకుంటున్నాయి. ప్రజలు, వివిధ వర్గాల వారు నేరుగా గవర్నర్​ను కలిసి తమ బాధలు చెప్పుకొనేందుకు అవకాశం కలుగనుంది. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన గవర్నర్  తమిళిసై.. ప్రజలను కలిసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచీ కూడా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను కలవలేదని ఆరోపణలున్నాయి. తొలి ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో జనహిత పేరుతో ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో ఎంపిక చేసిన వర్గాల వారితో సీఎం రెండు మూడు సార్లు భేటీ అయ్యారు. తర్వాత ఆ కార్యక్రమం కొనసాగలేదు.

ఇప్పుడు గవర్నర్ తమిళిసై ప్రజా దర్బార్ తో నేరుగా ప్రజలను కలిసేందుకు సిద్ధమవడంతో అందరి దృష్టి రాజ్ భవన్ పై పడనుంది. ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేరుగా అక్కడికే వెళ్లి పరిష్కారం కోసం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రజలు, వివిధ వర్గాల వారు, ఉద్యోగులు, కార్మికులు ఇలా ఎవరైనా, ఏదైనా సమస్య ఉంటే.. ఎవర్ని కలవాలో తెలియని పరిస్థితి ఉందన్న విమర్శలున్నాయి. సీఎంను కలిసేందుకు ప్రగతిభవన్ కు వెళ్లేందుకు అనుమతి దొరకదు. కొందరు మంత్రులను కలిసేందుకు అవకాశం దొరకదని, మరికొందరు మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కారం కావన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ భవన్లో ప్రజాదర్బార్ మొదలైతే… ప్రగతిభవన్ కు వెళ్లాలనుకునే వారంత రాజ్ భవన్ కు వెళ్తారని టీఆర్ఎస్ సీనియర్  నాయకుడొకరు అన్నారు. ప్రజలను గవర్నర్  నేరుగా కలిస్తే రాజ్ భవన్  గ్రివెన్స్ సెల్ గా మారుతుందని ఓ మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎంను కలిసేందుకు పార్టీలోని చాలా మంది నాయకులకు అవకాశం ఇవ్వడం లేదని, ప్రజాదర్బార్ మొదలైతే పార్టీ నాయకులు కూడా అక్కడికే వెళ్తారేమోనని కామెంట్​ చేశారు.

ఇంటర్  విద్యపై ఆరా

రెండు రోజుల కింద విద్యాశాఖ సెక్రెటరీ జనార్దన్ రెడ్డి గవర్నర్ తమిళిసైను మర్యాద పూర్వకంగా కలిసేందుకు రాజ్ భవన్ కు వెళ్లారు. ముందుగా కుశల ప్రశ్నలు వేసిన గవర్నర్.. తర్వాత విద్యాశాఖ అంశాలపై ఆరా తీశారని తెలిసింది. ఇంటర్  ఫలితాల్లో వివాదాన్ని కూడా ప్రస్తావించారని, తప్పు ఎవరిదని ఆరా తీశారని సమాచారం. దీనిపై ఒక రిపోర్ట్  ఇవ్వాలని కూడా ఆదేశించినట్టు విద్యాశాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే ఇంటర్​ ఫలితాల అంశంపై బీజేపీ నేతలు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేయగా.. రిపోర్టు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

24న వీసీలతో సమీక్ష

యూనివర్సిటీలకు గవర్నర్​ చాన్స్ లర్ గా వ్యవహరిస్తారు. విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు గవర్నర్​ అన్ని వర్సిటీల వీసీలతో రాజ్ భవన్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మధ్య వీసీల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఇన్​చార్జీ వీసీలుగా ఐఏఎస్ లకు బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రాజ్ భవన్లో జరిగే సమీక్షకు ఇన్​చార్జీ వీసీలు వెళ్తే గవర్నర్  ఏమంటారోనని అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాతవారి పదవీకాలం ముగిసి చాలా కాలమైనా పూర్తిస్థాయి వీసీలను ఎందుకు నియమించలేదన్న ప్రశ్న వస్తే ఏం చెప్పాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు.

తర్వాత హెల్త్​ డిపార్ట్​మెంట్​పైనే..

విద్యాశాఖ పనితీరుపై గవర్నర్  సమీక్షిస్తారని, తర్వాత వైద్యారోగ్యశాఖపై దృష్టి సారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా జనం విషజ్వరాలతో ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంగళవారం గవర్నర్ ను కలిసిన టీటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే చొరవ చూపి ప్రజలను రక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్  త్వరలో వైద్యశాఖ అధికారులను పిలిపించి మాట్లాడే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

నరసింహన్​ తరహాలో సమీక్షలకు..

మాజీ గవర్నర్  నరసింహన్  కూడా గతంలో ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలు చేశారు. ఇంటర్  ఫలితాలపై వివాదం తలెత్తిన సమయంలో నరసింహన్  నేరుగా విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. తప్పు ఎక్కడ జరిగిందని ఆరా తీసి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. యూనివర్సిటీ డాక్టరేట్ల ప్రదానంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులకు సంబంధించి అధికారులను పిలిచి అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టరేట్  పట్టా పొందిన వారి పరిశోధనా పత్రాలపైనా ఆరా తీశారు. పోలీసు శాఖపై పలుమార్లు సమీక్షించారు. నరసింహన్ తరహాలోనే గవర్నర్ తమిళిసై కూడా ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షలకు శ్రీకారం చుట్టారని రాజకీయవర్గాలు అంటున్నాయి.