మలక్ పేట ఘటన బాధాకరం: గవర్నర్ తమిళిసై

మలక్ పేట ఘటన బాధాకరం: గవర్నర్ తమిళిసై

మలక్పేట ఆస్పత్రి ఘటనపై గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించారని.. గైనకాలజిస్ట్గా తనకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రభుత్వం పంపిన బిల్లులు పెండింగ్ లో కాదని.. పరిశీలనలో ఉన్నాయని  గవర్నర్ తెలిపారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివాదాలతో నియామకాలు ఆలస్యం కావొద్దన్నదే తన ఉద్ధేశ్యమన్నారు. ఈ తరహా విధానాలపై గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని చెప్పారు. యూజీసీ కొన్ని అంశాలను ప్రస్తావించిందన్న తమిళిసై.. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.  తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.