ఖైరతాబాద్ మహాగణనాథుడికి గవర్నర్ తొలి పూజ

ఖైరతాబాద్ మహాగణనాథుడికి గవర్నర్ తొలి పూజ

ఖైరతాబాద్ మహాగణనాథుడు తొలి పూజ అందుకున్నాడు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వీరితో పాటు మహాగణనాథుడికి  మంత్రి తలసాని, ఎమ్యెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి పాల్గొని వినాయకుడికి మహా హారతి ఇచ్చారు. వీరితో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం బడా గణేశ్ ని సందర్శించారు. అంతకుముందు ఈ ఖైరతాబాద్ వినాయకుడికి భారీ లడ్డును నిర్వాహకులు సమర్పించారు. ఈ సారి 50 అడుగుల ఎత్తులో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతి  వినాయకుడికి మొదటగా పద్మశాలి సంగం తరపున పట్టు వస్త్రాలు, గరికపూస, వెండి జంజాన్ని నిర్వాహకులు సమర్పించారు. 

తెలంగాణ వచ్చాక గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.  అన్ని పండుగలకు నిధులు కేటాయించి వైభవం జరిపిస్తున్నామని చెప్పారు. .నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు . మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆదర్శంగా నిలిచిందన్నారు. 

ఇక 60ఏళ్ల ఖైరతాబాద్ గణేశుని చరిత్రలో ఈ సారి మట్టితో చేసిన వినాయకున్ని నిర్మించడం చెప్పుకోదగిన విషయం. శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమిస్తోన్న ఖైరతాబాద్ గణపతిని చూసేందుకు.. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. అత్యధిక సంఖ్యలో అక్కడికి చేరి గణేశుడికి పూజలు చేస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.