బాలిక గ్యాంగ్‌ రేప్పై తమిళిసై దిగ్భ్రాంతి

బాలిక గ్యాంగ్‌ రేప్పై తమిళిసై దిగ్భ్రాంతి

జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్‌పేట‌లో బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ కి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. 

ఏం జరిగిందంటే..

మీర్ పేటలో  గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు కత్తులతో బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం(ఆగస్టు 19)  మీర్ పేట పరిధిలోని తన సోదరి ఇంటికి తమ్ముడితో కలిసి బాధిత బాలిక వచ్చింది. అదేరోజు స్థానిక యువకుడు ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించడంతో అడ్డుకుంది. దీంతో అతడు మరో ఏడుగురితో కలిసి సోమవారం(ఆగస్టు 21) ఉదయం బాలిక సోదరి ఇంట్లోకి కత్తులతో వచ్చి బెదిరించాడు. 

గంజాయి మత్తులో ఉన్న దుండగులు ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఆ తర్వాత ముగ్గురు యువకులు బాలికపై అత్యాచారం చేశారు. ఆమె తమ్ముడి ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని రాచకొండ సీపీ చౌహాన్ పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.