‘మన్ కీ బాత్’తో లక్షల మందిని ఇన్​స్పైర్ చేస్తున్నరు: తమిళిసై

‘మన్  కీ బాత్’తో లక్షల మందిని ఇన్​స్పైర్ చేస్తున్నరు: తమిళిసై

హైదారాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ మన్  కీ బాత్  ప్రోగ్రామ్​తో లక్షల మందిని ఇన్​స్పైర్ చేస్తున్నారని గవర్నర్  తమిళిసై అన్నారు.  ప్రధాని గొప్ప కమ్యూనికేటర్, మోటివేటర్ అని గవర్నర్  కొనియాడారు. వివిధ రంగాల్లో  ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలను మన్  కీ బాత్ లో ప్రస్తావిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం రాజ్ భవన్ లో ప్రధాని మోడీ మన్  కీ బాత్  100వ ఎపిసోడ్​ను స్పెషల్  స్ర్కీనింగ్  చేశారు. ఈ ఎపిసోడ్​కు గుర్తుగా రాజ్ భవన్ లో గవర్నర్  మొక్క నాటారు.

గతంలో ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రస్తావించిన తెలంగాణకు చెందిన విశిష్ట వ్యక్తులు మౌంటెయినర్  మాలావత్  పూర్ణ, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతు చింతల వెంకటరెడ్డి, చేనేత కార్మికుడు హరిప్రసాద్,  తన ఆస్తిని దానం చేసి లైబ్రరీ ఏర్పాటు చేసిన విఠలాచార్య తదితరులను గవర్నర్  సన్మానించారు. తర్వాత కేంద్ర పథకాలపై ప్రెస్  ఇన్ఫర్మేషన్  బ్యూరో ఏర్పాటు చేసిన  ఫొటో ఎగ్జిబిషన్​ను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన్ కీ బాత్  ప్రోగ్రామ్​ను వంద కోట్ల మంది వింటున్నారని, రేడియో ద్వారా వినడంతో రేడియోకు మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు.

స్వచ్ఛ భారత్, అవయవ దానం, అవయవ మార్పిడి, పర్యావరణ సంరక్షణ, ఆత్మనిర్భర్  భారత్  వంటి అంశాలను ప్రధాని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్నారు. మౌంటెయినర్  మాలావత్  పూర్ణ మాట్లాడుతూ మన్ కీ బాత్​లో తన పేరును ప్రధాని ప్రస్తావించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 2014లో తాను ప్రధానిని కలిశానని ఆమె గుర్తుచేసుకున్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన విఠలాచార్య మాట్లాడుతూ, చిన్న లైబ్రరీగా తాను ప్రారంభించిన గ్రంథాలయంలో ఇపుడు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయని, ఇక్కడ ఉన్న బుక్స్ చదివి  పది మంది పీజీలు పూర్తిచేశారన్నారు. మన్ కీ బాత్ లో తన పేరు ప్రస్తావించిన తర్వాత ఎన్నో వర్సిటీల వాళ్లు వచ్చారని ఆయన చెప్పారు..