రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారు : తమిళిసై

రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారు : తమిళిసై

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులోకి కూడా రాజ్ భవన్ ను లాగాలని చూశారని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. రాజ్ భవన్ పై రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాంహౌస్ ఆడియో టేప్ విషయంలోనూ రాజ్ భవన్ ప్రస్తావన వచ్చిందన్నారు. తన మాజీ ఏడీసీ తుషార్ పేరును ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చారని, తుషార్ గతంలో తనకు ఏడీసీగా పని చేశారని తెలిపారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందని తమిళిసై చెప్పారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతోందని చెప్పారు. 

తాను జిల్లాల పర్యటనలో ఉన్నప్పుడు అధికారులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడదని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు. తన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే సంబంధిత అధికారులకు పంపిస్తామని చెప్పారు. ప్రొటోకాల్ పాటించేవారైతే.. తనకు స్వాగతం పలికేందుకు రాని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం  చెప్పాలన్నారు.