స్టూడెంట్లకు అండగా ఉంట : తమిళిసై

స్టూడెంట్లకు అండగా ఉంట  : తమిళిసై

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాల యువతతో పోలిస్తే తెలంగాణ యువత ఎన్నో సవాళ్లను ఎదుర్కుంటోందని గవర్నర్  తమిళిసై అన్నారు. ఏ సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొనే సత్తా రాష్ట్ర యువతకు ఉందని, వారికి అండగా ఉంటానన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. సోమవారం రాజ్ భవన్​లో ఉగాది వేడుకలు నిర్వహించారు. హైకోర్టు చీఫ్  జస్టిస్  ఉజ్జల్  భూయాన్ దంపతులు, పలువురు హైకోర్టు జడ్జిలు, యూనివర్సిటీల స్టూడెంట్లు, రెడ్ క్రాస్ నుంచి ప్రతినిధులు ఉత్సవాలకు హాజరయ్యారు. గవర్నర్  మాట్లాడుతూ రాజ్ భవన్​లో కార్యక్రమాలకు రావాలని వీఐపీలకు ఇన్విటేషన్లు పంపినా  రావడం లేదని, కానీ ఉగాది ఉత్సవాలకు ఆహ్వానం అందుకున్న యూత్  భారీగా వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. స్టూడెంట్లకు కష్టాలు వస్తే  ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రానికి నన్ను గవర్నర్​గా నియమించినప్పుడు నేను బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తానా అని అందరూ సందేహించారు. నేను గైనకాలజిస్ట్ ని. డాక్టర్ ని. బిడ్డలకు ప్రాణం పోస్తా. అదేవిధంగా రాష్ట్రాన్ని కూడా నడిపిస్త. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు” అని గవర్నర్  పేర్కొన్నారు. కాగా, వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 13 మందికి గవర్నర్ ఉగాది పురస్కారాలతో సన్మానించారు.

మరోసారి అధికారుల గైర్హాజరు
రాజ్ భవన్​లో నిర్వహించిన ఉగాది వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ అధికారులు మళ్లీ గైర్హాజరయ్యారు. సీఎస్ , డీజీపీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఒక్కరూ కూడా అటెండ్ కాకపోవడం గమనార్హం.