గవర్నర్ యాక్టివ్..బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్

గవర్నర్ యాక్టివ్..బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్
  • గవర్నర్ యాక్టివ్ 
  • బ్లేమ్ గేమ్ పై తమిళిసై కౌంటర్
  • వరదలు, స్త్రీ సంక్షేమంపై దృష్టి
  • వరంగల్ లో పర్యటిస్తున్న గవర్నర్
  • గందరగోళంలో ప్రైవేటు వర్సిటీల విద్యార్థులు
  • శ్రీనిధి, గురునానక్ వర్సిటీలో నిత్యం గొడవలు
  • ఆమోదానికి ముందే వర్సిటీల పేరిట అడ్మిషన్లు
  • తాను కారణం కాదంటూ క్లారిటీ ఇచ్చిన తమిళిసై

హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. గత కొంతకాలంగా పాలనా వ్యవహరాలను పెద్దగా పట్టించుకోలేదు. ఇవాళ ఏకంగా వరంగల్ లో వరద ప్రాంతాలను సందర్శిస్తుండటం విశేషం. బ్లేమ్ గేమ్ పై స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. కావేరీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్ , ఎంఎన్ఆర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఇక్మార్), శ్రీనిధి యూనివర్సిటీల ఏర్పాటు కోసం బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన ప్రభుత్వం అప్రూవల్ కోసం గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే. 

అనుమతి, గెజిట్ ఏమీ చూసుకోకుండానే శ్రీనిధి, గురునానక్ కాలేజీలు వర్సిటీల అవతారమెత్తాయి. కేవలం కేబినెట్ ఆమోదం ఆధారంగా ఈ సంస్థలు వర్సిటీల పేరిట అడ్మిషన్లు ప్రారంభించాయి. నిజమేననుకున్న వేలాది మంది విద్యార్థులు వీటిలో చేరారు. అటు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు నిత్యం ఆందోళనబాట పడుతున్నారు. దీనికి తాను కారణమంటూ ప్రభుత్వం బద్నాం చేస్తోందని గవర్నర్ కౌంటర్ అటాక్ కు దిగారు. రాజ్ భవన్ కు బిల్లును పంపిన తర్వాత తాను పూర్వాపరాలు పరిశీలించాల్సి ఉంటుందని, తన సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సి ఉంటుందని అవేమీ చేయకుండానే తాను ఎలా సంతకం పెడతానని గవర్నర్ ప్రశ్నిస్తున్నారు. సందేహాలున్న బిల్లులను వెనక్కి పంపానని చెబుతున్నారు. 

వరద నష్టంపై కేంద్రాని నివేదిక 

వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నష్టం తీవ్రంగా ఉందని కోరుతూ బీజేపీ, కాంగ్రెస్ కిసాన్ సెల్ నిన్న గవర్నర్ కు వినతిపత్రం సమర్పించాయి. దీనికి స్పందించిన తమిళిసై ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరద నష్టాన్ని పరిశీలించడంతోపాటు బాధితులతో మాట్లాడి కేంద్రానికి నివేదిక పంపనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇక్కడ వరదలు వస్తే సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పొలిటికల్ టూర్లు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులు, మీడియాలో వచ్చిన కథనాలను బేస్ చేసుకున్న గవర్నర్ స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపట్టిన సహాయ చర్యలపైనా రివ్యూ చేయనున్నారు. 

పలు మీటింగ్స్ కు హాజరు 

ప్రభుత్వం పట్టించుకోకున్నా గవర్నర్ తమిళిసై తన పని తాను చేసుకుపోతున్నారు. రాజ్ భవన్ కేంద్రంగా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుండటం విశేషం. మహిళల ఆరోగ్యంపై ఫౌండేషన్ ఫర్ సిటీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు. నిన్న మారియట్ లో జరిగిన సౌత్ ఇండియా మీడియా సమ్మిట్ కు హాజరై మీడియా రోల్ పై మాట్లాడారు. అంతకు ముందు జూన్ 2న జరిగిన రాష్ట్రావతరణ వేడుకలకు సర్కారు ఆహ్వానించకున్నా రాజ్ భవన్ లో వేడుకలను నిర్వహించారు. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతుండటం విశేషం.