నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు

నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై ఈ రోజు(జూన్ 10న) నిర్వహించిన ‘మహిళా దర్బార్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు తమ సమస్యలను గవర్నర్ కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మహిళా దర్బార్‌కు వచ్చిన వారితో వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు చెప్పిన సమస్యలను విని, తప్పకుండా పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు.

మహిళా దర్బార్ కార్యక్రమంపై వచ్చిన కామెంట్స్ పై గవర్నర్ స్పందించారు. ‘గవర్నర్ ప్రజలను కలుస్తారా..? లేదా అని అడిగారు. కరోనా సమయంలో సెక్యూరిటీ సిబ్బంది వద్దన్నా నిమ్స్‌ ఆస్పత్రిలో రోగుల బాగోగులను తెలుసుకున్నాను. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకు ఒకసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నాం’ అని గవర్నర్ తెలిపారు. 

తెలంగాణ కోసమే పని చేస్తున్నానని, మహిళలకు అండగా ఉంటానని, తనని ఆపే శక్తి ఎవరికీ లేదని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మహిళలు ఇబ్బంది పడితే తాను చూస్తూ ఉండలేనని, రాష్ట్ర ప్రభుత్వానికి, బాధిత మహిళలకు మధ్య వారధిగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను చేసే పనులకు ఎవరూ అడ్డు చెప్పినా పట్టించుకోనని, నిరసనకారుల గురించి ఆందోళన చెందనని అన్నారు. గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది మహిళలు పాల్గొన్నారు.