వర్సిటీల వీసీలతో గవర్నర్​ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్

 వర్సిటీల వీసీలతో గవర్నర్​ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్, వెలుగు: జీ 20 వేడుకల్లో స్టూడెంట్లు ఎక్కువగా పాల్గొనేలా చూడాలని గవర్నర్ తమిళిసై సూచించారు. మంగళవారం ఆమె, రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..మన దేశం ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన జీ-20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిందని గుర్తుచేశారు. 

మన సాంస్కృతిక,  సాంప్రదాయ వారసత్వాన్ని ఆయా శక్తివంతమైన దేశాలకు తెలిసేలా ప్రదర్శనలు చేయాలన్నారు.  తెలంగాణలో ఆరు ప్రధాన కార్యక్రమాలు ఉంటాయని తమిళిసై వెల్లడించారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వం, ప్రత్యేక నిర్మాణాలను హైలైట్ చేయడానికి ఇది గొప్ప అవకాశమని చెప్పారు. ఉత్తమ సావనీర్‌లను తీసుకురావడానికి యూనివర్సిటీల్లో ఒక పోటీని కూడా గవర్నర్ ప్రకటించారు. 

విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్, వక్తృత్వం, పెయింటింగ్, పోస్టర్ మేకింగ్ ఇతర సాంస్కృతిక పోటీలతో జీ 20 వారాన్ని నిర్వహించాలని వీసీలకు తమిళిసై స్పష్టం చేశారు.