
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉదయం సికింద్రాబాద్ నుంచి మణుగూరు ట్రైన్ లో ఆమె బయలుదేరారు. మణుగూరు స్టేషన్ లో అధికారులు గవర్నర్ తమిళిసైకు ఘన స్వాగతం పలికారు.
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా గవర్నర్ తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాములపల్లి గ్రామాన్ని సందర్శించారు. భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. అనంతరం స్థానిక ఎస్కేటీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసరాలు, దప్పట్లతో పాటు హెల్త్ కిట్లు పంపిణీ చేశారు.
అనంతరం గవర్నర్ తమిళిసై అశ్వాపురం మండలం చింత్రియాల గ్రామాన్ని సందర్శించారు. వరద బాధితుల ఇళ్లను పరిశీలించారు. వర్షాల కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం HWPM కాలనీలో నిత్యావసరాలు, మెడికల్ కిట్లు అందజేశారు. వరద బాధితులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.