లాయర్​ దంపతుల హత్యపై రిపోర్ట్​ ఇవ్వండి

లాయర్​ దంపతుల హత్యపై రిపోర్ట్​ ఇవ్వండి
  • విచారణ వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్​కు గవర్నర్​ లేఖ
  • నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
  • రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్​ లేఖపై చర్చ

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన లాయర్​ దంపతులు వామన్​రావు, నాగమణి హత్యలపై గవర్నర్​ తమిళిసై స్పందించారు. హత్యలపై విచారణను తొందరగా పూర్తి చేయాలని, సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సర్కార్​కు లేఖ రాశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్కార్​కు గవర్నర్​ లేఖ రాసినట్టు రాజ్​భవన్​ వర్గాలు వెల్లడించాయి. మీడియాలో వార్తల ద్వారా లాయర్​ దంపతుల హత్య గురించి ఆమె తెలుసుకున్నారని చెబుతున్నారు.

హత్యలపై గవర్నర్​ స్పందిచడం పట్ల రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. వామన్​రావు హత్యపై హైకోర్టు చీఫ్​ జస్టిస్​, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, లాయర్లతో పాటు అందరూ స్పందించారు. హత్యలపై విచారణ నిదానంగా సాగుతోందని, పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలున్నాయి. హత్య వెనుక అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సర్కారుకు గవర్నర్​ లేఖ రాయడం చర్చకు దారితీసింది. ఇటీవలే పుదుచ్చేరి లెఫ్టినెంట్​ గవర్నర్​గానూ తమిళిసైకి రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆమె పుదుచ్చేరిలోనే ఉన్నారు. అక్కడి వ్యవహారాలూ చూసుకుంటూనే రాష్ట్ర రాజ్​భవన్​ అధికారులతోనూ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఆన్​లైన్​లో వచ్చిన సమస్యల గురించి ప్రభుత్వానికి సమాచారం పంపుతున్నారు. పుదుచ్చేరిలో ఉన్నా తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని గవర్నర్​ ఈమధ్యే చెప్పారు.