గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రస్తావిస్తాం

గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రస్తావిస్తాం
  • గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం సరైన విధానం కాదు
  • నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించాలి
  • కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగం రద్దు చేయడం సరైన విధానం కాదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నగరంలోని తాజ్ డెక్కన్ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహం పై సీఎల్పీ భేటీలో చర్చించామన్నారు. 
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం కేసీఆర్ అహంకారానికి నిదర్శనమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం రద్దుపై అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. 
రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకుపైగా ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికైనా బడ్జెట్ లో నిధులు కేటాయించాలనన్నారు. రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం అందజేయాలన్నారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న సంగమేశ్వరం , పోతిరెడ్డిపాడు విస్తరణపై  కేసీఆర్ ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టతనిచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో పోలీస్ అక్రమాలు పెరిగిపోయాయని, పోలీసులు టీఆర్ఎస్ అనుబంధ సంస్థ మాదిరిగా గులాబీచొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారని.. వీటిపై సభలో నిలదీస్తామన్నారు.

 

ఇవి కూడా చదవండి

నన్నెవరూ అవమానించలేదు..ఎవరికింద ఉద్యోగిని కాదు

 

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు

ద్వేషాన్ని జయిస్తే ప్రపంచమంతా మన వెనకే

కుకింగ్‌‌‌‌ క్వీన్‌‌‌‌: నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తోంది