ద్వేషాన్ని జయిస్తే ప్రపంచమంతా మన వెనకే

ద్వేషాన్ని జయిస్తే ప్రపంచమంతా మన వెనకే

కోపంలో మనిషి నాలుక... మనసు పనిచేసే దానికంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. ద్వేషం.. కరుణ కంటే ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. పగలో మనిషి ఇతరుల కంటే ఎక్కువగా తనకి తాను నష్టం కలిగించుకుంటాడు. అసూయలో వ్యక్తి స్వయంగా తన ఉనికినే పోగొట్టుకుంటాడు. మరో వైపు ఆనందం.. ఇందులో శరీరం కంటే మనిషి ఆత్మ ఎక్కువ సంతోషంగా ఉంటుంది . ప్రేమలో మనిషి దుఃఖం అందరిలో నిండిపోతుంది. ఇక అందరి సుఖం వాళ్లలోకి వచ్చేస్తుంది. మరి కోపం, పగ, ద్వేషంతో ఉండాలనుకుంటున్నారా?  లేక ఆనందంతో ప్రేమగా ఈ జీవితాన్ని గడపాలనుకుంటున్నారా? ఈ నిర్ణయం ఎవరికి వాళ్లే తీసుకోవాలి. బాగా ఆలోచించి తీసుకోవాలి అంటాడు కృష్ణుడు. 

ప్రవహించే నది ఎంతో శాంతంగా, సౌమ్యంగా,  అందంగా ఉంటుంది. మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. చుట్టు పక్కన ఉన్న భూములన్నింటినీ నందనవనంలా మార్చేస్తుంది. జంతువుల దప్పిక తీరుస్తుంది. పక్షుల కోసం ఆట స్థలంగా మారుతుంది. అదే ప్రవహించే నది కొన్ని సార్లు ఉప్పొంగి.. దేన్నీ వదిలిపెట్టదు. ఇల్లు, ఊరు, పొలాలు.. చివరికి పర్వతాల్ని కూడా ముంచేస్తుంది. అచ్చం ఇలానే ఉంటాయి మనిషిలోని కోపం, ద్వేషం, పగ లాంటి ఎమోషన్స్​ కూడా. ప్రశాంతంగా, అదుపులో ఎప్పటివరకు ఉంటాయో.. అప్పటివరకు సంతోషాల్ని ఇస్తాయి. కానీ, అదుపు తప్పి బయటకు వచ్చాయంటే మొత్తాన్ని నాశనం చేసేస్తాయి.  అందుకే వీటిని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది. అప్పుడే ఈ ప్రపంచమంతా మన వెనకే ఉంటుంది. మరి వీటిని కంట్రోల్​ చేయడం ఎలా? 

ఎక్స్​పెక్టేషన్స్​ వద్దు

కోపం, పగ, ద్వేషం, అసూయ... ఇవన్నీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనిషిని చేరతాయి. కానీ,  ఎందుకు?  అన్నది ఇక్కడి ప్రశ్న. ఆలోచిస్తే సాధారణంగా ఈ ఎమోషన్స్​ ఎప్పుడొస్తాయి? మన నిర్ణయాల్ని ఎవరైనా గౌరవించనప్పుడు, ఎవరైనా మనకి నచ్చని పని చేసినప్పుడు లేదా మనకి నచ్చినట్టుగా నడుచుకోనప్పుడు.. అంతే కదా!. అంటే ఇక్కడ ఈ ఎమోషన్స్​ అన్నింటికీ కారణం ఎక్స్​పెక్టేషన్స్​. ఎదుటి వాళ్లు మన అంచనాల్ని అందుకోనప్పుడు కోపం, పగ, ద్వేషాలు మనసుని అల్లుకుంటున్నాయి. ఒకవేళ అసలు ఎక్స్​పెక్టేషన్సే లేకపోతే..అన్ని బాధల నుంచి విముక్తి దొరికినట్టేగా! ఒక్కసారి ఎవరికి వాళ్లు ఆలోచించుకోండి. 

ఇన్ఫీరియారిటీ వదిలేయాలి

భయం..ఇదెప్పుడూ మనుషులతో పాటే ఉంటుంది. ఏదైనా కోల్పోతామేమోనన్న భయం. దేన్నైతే పొందామో... దాన్ని లాక్కుంటారేమోనన్న భయం. ఇదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్​. దీనికి ఉన్న మరికొన్ని పేర్లే కోపం, ద్వేషం, అసూయ. ఇన్ఫీరియారిటీ నుంచి పుట్టే ఇవి.. మండుతున్న నిప్పుని పట్టుకుని వేరొకరిపై విసరడం లాంటివి. ఇక వీటి వెనకున్న ఉద్దేశం.. ఎదురుగా ఉన్న వ్యక్తిని కాల్చడం. కానీ, అంతకన్నా ముందు మన చేతులే కాలిపోతుంటాయి. ఎప్పుడైతే మనిషి వేరొకరిపై కోపం, ద్వేషం తెచ్చుకుంటాడో  మొదట వాళ్ల నాశనానికే కారణం అవుతుందని గుర్తుంచుకోవాలి. మండుతున్న  చెట్టుపై ఏ పక్షీ వాలదు.. ఎవరూ దగ్గరికి రారు. అదే జరుగుతుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్​ని  వదలకపోతే. 

ప్రేమే విరుగుడు 

ఈ ఎమోషన్స్​ మనిషిలో విచక్షణను నాశనం చేస్తాయి. మనసులో విష బీజాల్ని నాటుతాయి. మంచేదో, చెడేదో.. తెలుసుకోలేని స్థితికి మనిషిని తీసుకెళ్తాయి. సొంత, పరాయి అన్న బేధాలన్నింటినీ  మర్చిపోయేలా చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషిలోని మృగాన్ని తట్టిలేపుతాయి. దానివల్ల ఈ ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. మనసులో గూడుకట్టుకున్న ద్వేషం,  పగలు మనుషుల మధ్య అడ్డుగోడలు కడతాయి. ఆత్మీయుల నుంచి దూరం చేస్తాయి. వీటితో దేన్నీ జయించలేడు మనిషి. చివరికి తనని తాను కూడా జయించలేడు. అందుకే ద్వేషం, పగ, కోపాలు మనల్ని దాటి ముందుకెళ్లకుండా అడ్డుకోవాలి. దానికి ప్రేమ ఒక్కటే మార్గం అని గుర్తుంచుకోవాలి. మన కుటుంబంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లందర్నీ ప్రేమిస్తే.. ద్వేషం, పగలతో పాటు ఈ లోకాన్నే జయించొచ్చు. 

ఆత్మ విమర్శే మార్గం

ఒకవేళ మనిషి స్థిరంగా, శాంతంగా ఉంటే...అప్పుడు ఎవరికి వాళ్లు... వాళ్ల ఆత్మని చూస్తూ.. వింటూ అర్థం చేసుకోగలుగుతారు. కానీ, ఈ కోపం, పగలు మనిషి ఆత్మ పిలుపుని పూర్తిగా కమ్మేస్తాయి. అందుకే కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని అదుపులో ఉంచుకోవాలి. దానికి మనసును స్థిరంగా ఉంచుకోవడం ఒక్కటే మార్గం. రోజులో కాసేపు ఎవరికి వాళ్లు టైం కేటాయించుకొని.. వాళ్లతో వాళ్లు మాట్లాడుకుంటే ఎలాంటి చెడు మనసులోకి రాదు. అలాగే ఎవరి మీదనైనా సరే కోపం.. పగ .. ద్వేషం లాంటి భావనలు వచ్చినప్పుడు. వాటివల్ల మనకి వచ్చేదేంటి? అని ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. దానివల్ల ఏం లాభపడుతున్నాం? అని ఎవరికి వాళ్లు ప్రశ్నించుకోవాలి. ఆ వచ్చే సమాధానం కచ్చితంగా ద్వేషం, కోపం, పగలని వదిలేలా చేస్తుంది. జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుతుంది. 
::: మానసి